విజయశాంతి హ్యాపీ…సినిమాల్లో కొనసాగుతుందా?

తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి హ్యాపీగా ఉంది. ఇందుకు కారణం.. తాజాగా విడుదలైన మహేష్‌బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' విజయవంతం కావడం, అందులో విజయశాంతి పాత్రకు మంచి పేరు రావడం. సినిమాల్లోకి ఆమె రీఎంట్రీ…

తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి హ్యాపీగా ఉంది. ఇందుకు కారణం.. తాజాగా విడుదలైన మహేష్‌బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' విజయవంతం కావడం, అందులో విజయశాంతి పాత్రకు మంచి పేరు రావడం. సినిమాల్లోకి ఆమె రీఎంట్రీ విజయవంతంగా జరగడంతో ఆమె దారి ఎటు? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తరువాత ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సినిమా రంగంలో కొనసాగే ఆసక్తి ఉన్నట్లుగా చెప్పింది. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తరువాత ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శక్తిమంతమైన పాత్రలైతే చేస్తానని, అలాంటి పాత్ర ఏడాదికి ఒకటి వచ్చినా చాలని చెప్పింది. 

దీన్నిబట్టి ఒక్క సినిమాలో నటించి విరమించుకోవడం ఇష్టంలేదని అర్థమవుతోంది. విజయశాంతి చాలా సీనియర్‌. ఇంకా గ్లామరస్‌గానే ఉంది. గతంలో ఎన్నో సినిమాల్లో పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించింది. ఆ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. కాబట్టి దర్శకులు విజయశాంతి కోసం పవర్‌ఫుల్‌ పాత్రలు, ప్రాధాన్యంగల పాత్రలు సృష్టిస్తారు. ఫలాన పాత్ర విజయశాంతే పోషించాలనుకుంటే తప్పనిసరిగా ఆమెను సంప్రదిస్తారు. కాబట్టి సినిమా రంగంతో ఆమె మళ్లీ అనుబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చు. 'రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ పెరుగుతోంది. సినిమా చేస్తున్నప్పుడు మాత్రం మనశ్శాంతిగా ఉంటుంది' అని చెప్పింది. ఇది వాస్తవమే. 

కాని తాను రాజకీయాలు వదలుకోనని, తన జీవితం ప్రజలకు అంకితం చేశానని సరిలేరు నీరెవ్వరు సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పింది. ఒక పక్క రాజకీయాల్లో కొనసాగుతూనే, మరో పక్క మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తుందేమో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆమె కాంగ్రెసు పార్టీలో యాక్టివ్‌గా లేదని చెప్పొచ్చు. రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. కాని ఇప్పటివరకు ఆమె ఆ ఎన్నికల గురించి మాట్లాడలేదు. కాంగ్రెసు నాయకత్వమూ ఆమె గురించి ఏమీ చెప్పలేదు. విజయశాంతి పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌. 

కాని మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేస్తుందో చేయదో తెలియదు. పార్టీ తరపున స్టార్‌ క్యాంపెయినర్స్‌ త్వరలో ప్రకటిస్తామని టీపీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల తరువాత దాదాపు నాలుగేళ్లు ఆమె పార్టీకి దూరంగా, మౌనంగా ఉండిపోయింది. పార్టీ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకూ పార్టీని పట్టించుకోకుండా దూరంగా ఉన్న విజయశాంతి రాహుల్‌ గాంధీ ప్రమేయం, ప్రోత్సాహం కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించింది. మళ్లీ క్రియాశీలకంగా మారింది. 

ఏళ్లపాటు ఆమె అంటీముట్టనట్లుగా  ఉన్నా అధిష్టానం కారణంగా రాష్ట్రంలో ఆమెకు ప్రాధాన్యం లభించింది. హైకమాండ్‌ నిర్ణయాలను కాదనలేని రాష్ట్ర నాయకులు ఆమె  క్రియాశీలకం కావడాన్ని ఆహ్వానించారు. ప్రచార కమిటీ సారథిగా ఆమోదించారు. ఆ ఎన్నికల తరువాత రాష్ట్ర నాయకత్వం రాములమ్మను పట్టించుకోవడం మానేసింది. పార్టీ సమావేశాలకు ఆమెకు ఆహ్వానం అందడం లేదు. పార్టీ కోర్‌ కమిటీ సమావేశానికి పిలవలేదని బాధపడింది. పార్టీ తనను పక్కనపెట్టిందంటూ అసంతృప్తితో రగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది.