జగన్ పార్టీ గెలిచింది. జగన్ పార్టీ అభ్యర్ధులు గెలిచారు. రాష్ట్రం అంతటా సాధించిన విజయం వేరు. విశాఖలో సాధించిన గెలుపు వేరు. విజయమ్మను పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు సాగించి, విశాఖపై తమ పట్టుకోసం నానా అడ్డదారులు తొక్కింది ఓ సామాజికవర్గం.
విశాఖపై దశాబ్దాల కాలంగా తాము సంపాదించిన పట్టు ఎక్కడ పోతుందో అని భయపడింది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా కిందా మీదా అయిపోయింది. రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచినా, విశాఖలో వీలయినంత తక్కువలో వీచేలా చూసుకుంది.
కానీ అధికారంలోకి వచ్చింది మొదలు విజయసాయిరెడ్డి విశాఖ మీదే దృష్టి పెట్టారు. ఆయన వీలయినంత వరకు విశాఖలోనే వుంటూ వచ్చారు. పార్టీ నిర్మాణం, వ్యవహారాలు అన్నీ తానై చూసుకున్నారు. నిజానికి ఇలాంటి వ్యవహారం ఆ సామాజిక వర్గానికి అస్సలు కిట్టలేదు. విజయసాయి మీద నానా ప్రచారం సాగించింది. పైగా వారికి అను'కుల' మీడియా వుండనే వుంది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు.
వైకాపాలోని ఓ వర్గం కూడా విజయసాయి మీద కన్నేసింది. విజయసాయి జోరు సాగించడం వల్ల ఉత్తరాంధ్రలో తమ హవా సాగడం లేదని బొత్స లాంటి వాళ్లు లోలోపల కిందా మీదా అయ్యారు. విజయసాయికి కిట్టని గంటాను పార్టీలోకి తేవాలని ప్రయత్నించారు. అవంతి లాంటి నాయకులు కూడా తెరవెనుక మంతనాలు జరిపారు.
విశాఖ మేయర్ ఎన్నికల కీలక సమయంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ ఉక్కు అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు. రాష్ట్రంతో టచ్ లో వున్నామని, అప్ డేట్ చేస్తున్నామని సమాధానం రాబట్టారు. దాంతో వైకాపా కొంత వరకు కార్నర్ లోకి వెళ్లాల్సి వచ్చింది.ఎంపీ ఎంవివి కావాలనే ఇదంతా చేసారనే గుసగుసలు వైకాపాలో వినిపిస్తున్నాయి.
మొత్తం మీద వైకాపాలో విజయసాయి ఒంటరి పోరు సాగించారు. మంత్రి కన్నబాబు మాత్రమే ఆయనతో కలిసి నడిచారు. ఓ ఎమ్మెల్యే తాను అంతా చూసుకుంటా వదిలేయండి అన్నారు. అక్కడ వైకాపా చాలా సీట్లు నష్టపోయింది.
విజయోత్సవాల వేళ ఎంపీ జాడ కనిపించీ కనిపించనట్లు వుంది. మొత్తం మీద తెలుగుదేశం పట్టు విశాఖ మీద చాలా వరకు సడలింది. దశాబ్దాల కాలంగా విశాఖను ఉక్కు పిడికిలిలో పెట్టిన ఆ సామాజిక వర్గం పట్టు సడలడం ప్రారంభించింది. మరో మూడు నాలుగేళ్లు విజయసాయి ఇలాగే కష్టపడితే, ఉత్తరాంధ్రకు ఆ సామాజిక వర్గ చెర చాలా వరకు వీడే అవకాశం వుంది.