ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాది కిందట ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియనంతా అర్ధాంతరంగా వాయిదా వేసి సంచలనం రేపారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా నిమ్మగడ్డ ప్రకటించారు. అయితే ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండానే ఆ నిర్ణయం తీసుకోవడం పెనుదుమారాన్ని రేపింది. ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ వేరే వివరించనక్కర్లేదు.
ఇక నిమ్మగడ్డ పదవీ కాలంలో మరో పక్షం రోజులు మాత్రమే మిగిలాయి. ఆయన అనుకుంటే.. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు. ఎందుకంటే.. వాటికి సంబంధించి ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఎలాగూ మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోట నుంచినే జరిపారు. కోర్టు కూడా ఆ మేరకు తీర్పును ఇచ్చింది.
ఇప్పుడు ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలకూ అదే తీర్పు వర్తించగలదు. ఈ నేపథ్యంలో వారం పది రోజుల్లో అందుకు సంబంధించిన పోలింగ్ ను నిర్వహించగల యంత్రాంగం ఎస్ఈసీ వద్ద ఉండనే ఉంది. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల విధుల నుంచి అధికారులను రిలీవ్ చేస్తున్నారట.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో చేరిన పలువురిని వారు ఇంతకు ముందుపని చేసిన శాఖల్లోకి పంపిస్తున్నారట నిమ్మగడ్డ. ఈ నేపథ్యంలో.. ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికలను నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సానుకూలంగా లేరని స్పష్టం అవుతూ ఉంది.
తన పదవీ కాలం ముగిసేలోపే స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా పట్టు పట్టినట్టుగా కనిపించారు. అయితే తీరా ఇప్పుడు అవకాశం ఉన్నా.. ఎందుకు ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడం లేదు? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
పంచాయత్, మున్సిపోల్స్ లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉనికినే ఆ ఎన్నికలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో ఇదే ఊపులో ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికలను పెట్టేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ అడ్రస్ ను ఆ ఎన్నికలు పూర్తిగా గల్లంతు చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు నిమ్మగడ్డ వెనక్కు తగ్గుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.
అర్ధాంతరంగా స్థానిక ఎన్నికలను నిర్వహించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలని భావించారని, అయితే ప్రజాతీర్పుతో టీడీపీ చిత్తయిపోవడంతో.. ఇప్పుడు ఆయన ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికలను నిర్వహించడానికి సాహసం చేయలేకపోతున్నారనే అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి స్పష్టంగా బయటపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పుడు ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికల నిర్వహణ గురించి కిక్కురుమనడం లేదసలు!