ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంసిద్ధంగా లేరని స్పష్టం అవుతూ ఉంది. అయితే ఆ ఎన్నికలను వాయిదా వేసి ఆయన తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా మేలు చేసే అవకాశాలు కూడా పెద్దగా లేనట్టే. ఎలాగూ ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఒకవేళ ఆయన ఎస్ఈసీ పదవిలోనే ఉండి ఉంటే.. ఇప్పట్లో ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేవి కావేమో అనే చర్చ ఇప్పుడు సామాన్యుల్లో జరుగుతూ ఉంది.
అచ్చం ఒక రాజకీయ నేత వలే ప్రసంగాలు చేసి, ప్రభుత్వాన్ని కేసుల విషయంలో బ్లాక్ మెయిల్ చేసినట్టుగా మాట్లాడి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజల్లో బోలెడన్ని సందేహాలను జనరేట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై నమోదు అయిన కేసుల్లో తను సాక్ష్యం చెప్పాల్సి ఉందంటూ చేసిన వ్యాఖ్యతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తటస్థుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. బహుశా ఏపీ రాష్ట్ర చరిత్రలో ఇంత వివాదాస్పదం అయిన ఎన్నికల కమిషనర్ మరొకరు లేరని చెప్పవచ్చు.
ఇక తెలుగుదేశం పార్టీకి పంచాయతీ, మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో ఇప్పట్లో నిమ్మగడ్డ ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికలను తీసుకురావడానికి సంసిద్ధంగా లేకపోవచ్చని ప్రజలు అనుకుంటున్నారు.
ఒకవేళ తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండి ఉంటే.. తను పదవీ విరమణ చేసే లోపే నిమ్మగడ్డ పెండింగ్ లోని ఎన్నికలను నిర్వహించే వారని, ఎలాగూ టీడీపీ చిత్తయిపోతూ ఉండటంతో ఇప్పుడు ఆయన ఆ ఎన్నికలను నిర్వహించరని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చిందంటే.. ఇప్పటి వరకూ ఏం జరిగిందో, ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు!
ఆ సంగతలా ఉంటే.. ఏపీలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు వీలైనంత త్వరగానే జరిగే అవకాశం ఉందని మాత్రం స్పష్టం అవుతోంది. నిమ్మగడ్డ పదవీ విరమణ జరగగానే కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం వీలైనంత త్వరగానే జరగనుంది. కొత్త కమిషనర్ రాగానే.. తొలి వారం పది రోజుల్లోనే ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సర్వత్రా.
ఆల్రెడీ ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ప్రచారానికి వారం పది రోజుల సమయం ఇచ్చి, పోలింగ్ డేట్ ను ప్రకటించడానికి అవకాశం ఉంది. ఆ లోపే ఎస్ఈసీ కూడా ఏర్పాట్లను పూర్తి చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో.. నిమ్మగడ్డ రమేష్ తో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగానే ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది.