రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన 27 శాతం ఓట్లనో, 27 శాతం పంచాయతీ ప్రెసిడెంట్ పదవులనో సాధించినట్టుగా ఆ మధ్య ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. అవతల తన గురువుగారు చంద్రబాబు నాయుడు తన పార్టీ పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం ఓట్లనో, సీట్లనో పొందిందని ప్రకటిస్తే.. శిష్యపరమాణువుగా తన వాటా 27 శాతం అని పవన్ కల్యాణ్ క్లైమ్ చేసుకున్నారు!
గాలికిపోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా.. పార్టీ గుర్తులతో నిమిత్తం లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ వాటాను ఈ గురుశిష్యులు తోచిన స్థాయికి క్లైమ్ చేసుకున్నారు. తనకు నలభై శాతమని చంద్రబాబు చెప్పుకుంటే, తన శాతం 27 అని పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు!
పార్టీ గుర్తుల్లేకుండా ఆ ఎన్నికలు జరిగాయి కాబట్టి.. ఎక్కడకు బడితే అక్కడకు క్లైమ్ చేసుకోవడానికి అప్పుడు అవకాశం ఉండింది. అయితే మున్సిపల్- కార్పొరేషన్ ఎన్నికలతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది పాపం! లేకపోతే తనకు 50 శాతం అని చంద్రబాబు నాయుడు, తనకు ముప్పై శాతం అంటూ పవన్ కల్యాణ్ లు ఈ పాటికి రచ్చరచ్చ చేసే వాళ్లు.
ఈ ఎన్నికలను పార్టీ గుర్తుల మీద నిర్వహించడంతో.. ఎవరి సత్తా ఏమిటో గుర్తుల మీద బయటపడింది. పట్టణాలపై తమ పట్టు పోలేదనుకున్న చంద్రబాబుకు 30 శాతం ఓట్లు వస్తే, పవన్ కల్యాణ్ కు నాలుగు శాతం ఓట్లు దక్కాయి. పట్టణాల్లోనే వీళ్ల పరిస్థితి ఇదంటే.. పల్లెల్లో వీళ్ల పరిస్థితి ఏమిటో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఏకగ్రీవాల వల్ల పోల్ అయిన ఓట్ల లెక్కల్లో వైఎస్ఆర్సీపీ వాటా మరింత తగ్గిందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి.
మరి ఇంతకీ పంచాయతీ ఎన్నికల్లో 27 శాతం ఓట్లు గాజు గ్లాసు పార్టీకి వచ్చాయన్న పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారో! సార్వత్రిక ఎన్నికలప్పటి ఓట్ల వాటా కూడా ఇప్పుడు తగ్గిపోయినట్టుంది. 151 మంది ఎమ్మెల్యేలు అంటూ.. ఇన్నాళ్లూ మాట్లాడిన అహంభావపు మాటలను ఇకనైనా పవన్ కల్యాణ్ తగ్గించుకుంటారా? తన కున్న జనాదరణ ఏపాటిదో అర్థం చేసుకుంటారా? ఆ అవసరం ఎప్పటికీ లేదనుకుంటారో!