కేంద్రంలోని బీజేపీ తమకు గౌరవ మర్యాదలు ఇస్తున్నా, తెలంగాణ బీజేపీ మాత్రం అవమానిస్తోందని రెండు రోజుల క్రితం జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు జనసేనతో తెలంగాణ బీజేపీకి ఎలాంటి పొత్తు లేదని ఆ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీటుగా జవాబిచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ -జనసేన మధ్య పొత్తు విచ్ఛిన్నం అవుతుందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీవీ9లో చేపట్టిన బిగ్‌డిబేట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
డిబేట్లో భాగంగా జనసేనపై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ చెడుగుడు ఆడుకున్నారు. బీజేపీతో తెగదెంపులు దిశగా అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చా అని ప్రజెంటర్ రజనీకాంత్ సంధించిన ప్రశ్నకు జనసేన కార్యదర్శి శివశంకర్ నవ్వుతూ స్పందించారు. తెగదెంపులనేది చాలా పెద్ద పదమని, అలాంటిది ఏమీ లేదన్నారు. బీజేపీతో తమ పార్టీకి పొత్తు ఉందన్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతల అవగాహన లోపం లేదా అవగాహన రాహిత్యమై ఉండొచ్చన్నారు. అది తమ ఇంటి వ్యవహారమని, చక్కదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ స్పందిస్తూ జనసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే…
“తెలంగాణలో జనసేన పార్టీతో మాకు పొత్తులేదు. ఇది నేనే కాదు, మా అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చెప్పారు. జనసేనను అగౌరపరిచామనడం ఎంత వరకు సబబో మీరే చెప్పండి. ఎందుకంటే స్వతంత్ర పార్టీలుగా మేము గౌరవించడం, గౌరవించకపోవడం అనేది ఏముంది? ఇక రెండో విషయానికి వస్తే శివశంకర్ చాలా పెద్ద పదాలు వాడారు. అవగాహణ రాహిత్యమన్నారు. అది వారికి వర్తిస్తుందే తప్ప మాకు కాదు. దేని గురించి అవగాహన ఉండాలి.
సీపీఐ, సీపీఎంతో వారు పొత్తు పెట్టుకుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు. కాంగ్రెస్‌తో మినహా మిగిలిన అన్ని పార్టీలతో మీరు (జనసేన) పొత్తు పెట్టుకున్నారు. అవగాహన అనేది మీకున్నదా? వేరే వాళ్లకు లేదా? అనేది మీరు అర్థం చేసుకోండి. మీ సిద్ధాంతం ఏంటి. మీ పార్టీ ఏ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నది? మీరు పార్టీ స్థాపించినప్పుడు మీరేమనుకున్నారు? ఆ తర్వాత మీరెక్కడ ఉన్నారు? మీకు వచ్చిన ఓట్లెన్ని? మీ గెలుపెంత? మీ బలమెంత? మీరు ఎవరి మీద ఎట్లామాట్లాడ్తున్నారు? మా అధ్యక్షుడి మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మేము సైలెంట్‌గా ఉండం కదా?” అని సీరియస్ క్లాస్ తీసుకున్నారు.
అంతటితో జనసేనను ఆయన విడిచిపెట్టలేదు. తమ అధ్యక్షుడిపై ఘాటు విమర్శలు చేయడంతో పాటు టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడంపై తెలంగాణ బీజేపీ ఎంత ఆగ్రహంగా ఉందో కృష్ణ సాగర్ మాటల్లో ప్రతిబింబించింది. డిబేట్లో కృష్ణ సాగర్ ఇంకా ఏమన్నారంటే…
“బలమైన పార్టీగా మాట్లాడే మాటలు కాదు కదా ఇవి! మీకు బలం తక్కువున్నామేము గౌరవం ఇచ్చినందుకు ఏం చేశారు? టీఆర్ఎస్తో ఏదో అడ్జెస్ట్మెంట్ చేసుకుని, అది కూడా చివరి రోజు మద్దతు ప్రకటించారు. అది అవగాహన రాహిత్యమవుతుంది. అది నిలకడలేని తనమవుతుంది. నిబద్ధత లేకపోవడం అవుతుంది. ఒక్క మాట మీద నిలబడలేకపోవడం అవుతుంది. ఇది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పల్లెంలు పట్టుకుని పొద్దున లేచినప్పటి నుంచి ప్రదక్షిణలు చేయాలా? హారతులు ఇవ్వాలా?” అని జనసేనపై బీజేపీ అధికార ప్రతినిధి మాటల దాడి చేశారు.
ఈ అనూహ్య పరిణామానికి జనసేన ప్రతినిధి శివశంకర్ షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ సంయమనం పాటిస్తూనే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు జనసేనను తామెలా అగౌరవపరిచామో చెప్పాలని పదేపదే జనసేన నాయకుడిని బీజేపీ అధికార ప్రతినిధి ప్రశ్నించడం గమనార్హం. ఆ ప్రశ్నకు శివశంకర్ నుంచి సరైన సమాధానం మాత్రం రాలేదు. మొత్తానికి జనసేనతో తాడోపేడో తేల్చుకునే ఆలోచనతో తెలంగాణ బీజేపీ ఉన్నట్టు కృష్ణసాగర్ మాటల దాడిని బట్టి అర్థం చేసుకోవచ్చు.