సహజంగా అధికారం నుంచి దిగిపోయిన నేతలపై జనానికి కోపం ఉండదు. నడుస్తున్న ప్రభుత్వం చేస్తున్న పనులపైన్నే ప్రజానీకం దృష్టి ఉంటుంది. ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను జనం మరిచిపోతూ ఉండడం సహజం. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం రెండేళ్లు అవుతున్నా… ఇంకా ఆయనపై జనానికి ఏ మాత్రం కోపం తగ్గలేదని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి.
11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం చెల్లిన 47,46,195 ఓట్లలో వైఎస్సార్సీపీ 24,97,741 ఓట్లు దక్కించుకుంది. 52.63 శాతం ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే …. 14,58,346 ఓట్లు వచ్చాయి. 30.73 శాతం ఓట్లకే టీడీపీ పరిమితమైంది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లను దక్కించుకుంది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ 39.99 శాతం ఓట్లతో 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు పడిపోయింది. జగన్ సర్కార్ అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో అధికార పార్టీ తన సంక్షేమ పాలనతో రెండు శాతానికి పైగా ఓటు షేర్ పెంచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇదే టీడీపీ విషయానికి వస్తే రెండేళ్లలో 9 శాతం ఓటు బ్యాంకును కోల్పోయి మరింత దిగజారింది.
కాలం ఎంతటి గాయాలనైనా మాన్పుతుందంటారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో గాయపడని వర్గమంటూ లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీపై జనం ఇంకా కోపంగానే ఉన్నారంటే… చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపూ జగన్‌ను తనను అధికారానికి దూరం చేశారని అక్కసు బాబులో కనిపిస్తోంది. అందుకే జగన్‌పై చంద్రబాబు, లోకేశ్‌తో పాటు టీడీపీ ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ నేతలు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే… అధికారానికి మాత్రమే కాదు, తాము జనానికి కూడా దూరమయ్యామని. ఏం చేస్తే జనానికి దగ్గరవుతామో, ఆ పనులను టీడీపీ చేపట్టాల్సిన ఆవశ్యకతను స్థానిక సంస్థల ఫలితాలు చెబుతున్నాయి.
అలా కాకుండా జగన్‌ను టార్గెట్ చేస్తూ, ఎల్లో మీడియాలో పతాక శీర్షికతో ప్రచురితమయ్యే కథనాలను చదువుతూ పైశాచిక ఆనందం పొందాలనుకుంటే… అది వారిష్టం. ఎందుకంటే పతనమనేది ఎవరో చేసేది కాదు. అది వారి స్వయంకృతాపరాధమే.