బీజేపీతో పవన్ కల్యాణ్ కి పొసగడం లేదనే విషయం పూర్తిస్థాయిలో బయటపడిపోయింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థికి పవన్ మద్దతిచ్చారన్నప్పుడే బీజేపీకి ఆయన వ్యతిరేక దిశలో పోవడానికి నిర్ణయించుకున్నట్టు తేలిపోయింది.
పవన్ తొందరపడ్డారన్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఆయనకి జనసైనికుల కౌంటర్లు.. ఇవన్నీ బీజేపీతో పవన్ చెలిమి ముగిసిపోతున్న అధ్యాయం అన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?
ఏపీలో టీడీపీ ప్రభ పూర్తిగా తగ్గిపోయింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. స్థానిక ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన బాగా మెరుగైన స్థితిలో ఉంది. ఇంకా పవన్ బీజేపీతో కలసి నడవాలనుకోవడంలో అర్థం లేదు. వేరు కుంపటి పెట్టుకుని టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశానికి ఇదే మంచి తరుణం.
కేంద్ర తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత, విశాఖ ఉక్కు వ్యవహారం.. ఇలాంటివన్నీ పవన్ కి సంబంధం లేకుండానే జనసేనపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ ఇక్కడ పవన్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
నిజంగానే బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలిలో నుంచి బయటపడాలంటే పవన్ కి ఇంతకు మించిన టైమ్, టైమింగ్ రాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరుపతి ఉప ఎన్నికల సీటు వ్యవహారంలో అసంతృప్తి ఉన్నా కూడా మౌనంగా ఉండటం సరికాదని అంటున్నారు. బయటికొచ్చి తాడోపేడో తేల్చుకుంటే, భవిష్యత్ రాజకీయ ప్రయాణాన్ని సరైన డైరక్షన్లో నడిపే అవకాశముందని అంటున్నారు.
ఉక్కు హీరో కావాలని లేదా..?
సమస్యలు వస్తేనే, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. అలాంటిది ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే ప్రధాన సమస్య కళ్లముందు కనపడుతోంది. రోజుకో మాట మాట్లాడి, పూటకో పార్టీపై కర్చీఫ్ వేసే గంటా శ్రీనివాసరావులాంటి వ్యక్తులు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. అటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు కొన్ని పరిమితులున్నాయి.
ఈ దశలో పవన్ కల్యాణ్ ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహిస్తే తిరుగుండదని అంటున్నారు అభిమానులు. మద్దతుగా ఒక్క మాట మాట్లాడితేనే కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు, ఇక పవన్ తమ ముందుండి నడిపిస్తానంటే నెత్తిన పెట్టుకుంటారు. అయితే పవన్ మాత్రం బీజేపీతో పొత్తు వల్ల చేతులు కట్టేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి నవ్వులపాలవుతున్నారే కానీ, కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టడానికి సాహసం చేయట్లేదు.
పవన్ కల్యాణ్ ఇలాగే ఉంటే పాతికేళ్లయినా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బంధనాలు తెంచుకుని బయటకు రావాలని కోరుతున్నారు జనసైనికులు. మరి అధినాయకుడికి ఆ మాటలు వినపడుతున్నాయో లేదో తెలియాలి.