అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమాన్ని తప్పక గౌరవించాలి. ఒక ఉద్యమంపై భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ, పోరాడే ప్రజాస్వామిక హక్కును తప్పక ప్రేమించాలి. ప్రజాస్వామ్యంలోని బ్యూటీనే అది. అమరావతిలోనే పరిపాలన, న్యాయ రాజధానులు కూడా కొనసాగించాలనే డిమాండ్‌పై భూములిచ్చిన రైతులు చేపట్టిన ఉద్యమాన్ని కించపరచాల్సిన అవసరం లేదు.
అయితే చిక్కల్లా ఏంటంటే… ఆ ఉద్యమాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే శక్తులు, కుయుక్తులపైనే అభ్యంతరం. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఓటమితో మూడురాజధానులకే అమరావతి ప్రాంత ప్రజలు మద్దతు తెలిపారనే వాదన బలపడుతోంది.
మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో గుంటూరు, విజయవాడ నగరాల్లో వైసీపీకి పట్టం కడితే …మూడు రాజధానులకు మద్దతు ప్రకటించినట్టే అని పదేపదే చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో సహజంగానే మూడు రాజధానులకు రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న వాళ్ల మద్దతు కూడా ఉందని రుజువైంది.
ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమం మంగళవారానికి 455వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఇచ్చారనడంలో నిజం లేదన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకోలేదన్నారు. ఇప్పుడు వాటికి మద్దతుగా ఓటు వేశారని ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు.
అమరావతి రాజధానికి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవైపు చంద్రబాబు రాజధాని అంశాన్ని ఎన్నికల్లో బలిపెట్టారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఘోర ఓటమితో అమరావతి రాజధానికి శాశ్వతంగా సమాధి కట్టినట్టైంది. అలాగే ఆ ప్రాంత రైతులు, ఆందోళనకారుల డిమాండ్ అరణ్యరోధన అయ్యింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మూడు రాజధానులకు మద్దతు కాదని చెబుతున్న వారి మాటలు వింటూ… జాలితో నిట్టూర్పు విడవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.