తిట్టడం వరకు ఓకే.. ప్రచారం చేయనంటే ఎలా?

సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడిదే రాజ్యం. ఇది బహిరంగ రహస్యం. ఎవడికి పలుకుబడి ఉంటే వాడి మాటే చెల్లుతుంది. ఇదే విషయాన్ని విశ్వక్ సేన్ తన స్టయిల్…

సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడిదే రాజ్యం. ఇది బహిరంగ రహస్యం. ఎవడికి పలుకుబడి ఉంటే వాడి మాటే చెల్లుతుంది. ఇదే విషయాన్ని విశ్వక్ సేన్ తన స్టయిల్ లో చెప్పాడు. 'తగ్గేకొద్దీ మింగుతారు' అంటూ వల్గర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. “బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు..” అంటూ ఇంకో స్టేట్ మెంట్ కూడా పడేశాడు.

ఆవేశంగా ఇన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చిన విశ్వక్ సేన్, ఆ తర్వాత పోస్ట్ డిలీట్ చేశాడు. అతడు ఏదైనా అనొచ్చు, తన హ్యాండిల్ లో ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు, ఎవరిపైనైనా ఆరోపణలు చేయొచ్చు, అది అతడి ఇష్టం. ఎటొచ్చి ప్రచారం చేయనంటూ విశ్వక్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేశాడు విశ్వక్ సేన్. డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చాన్నాళ్ల కిందటే యూనిట్ ప్రకటించింది. అయితే సలార్ పోస్ట్ పోన్ అవ్వడంతో అన్ని సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి.

క్రిస్మస్ కు రావాల్సిన నాని సినిమా డిసెంబర్ 7కి వచ్చింది. అంతేకాదు, నితిన్-వరుణ్ తేజ్ సినిమాలు కూడా అదే వారానికి షెడ్యూల్ అయ్యాయి. దీంతో విశ్వక్ సేన్ సినిమాపై ఒత్తిడి పెరిగింది. సినిమాను వాయిదా వేయమంటూ తెరవెనక ఒత్తిళ్లు కూడా వచ్చినట్టు అతడి పోస్టుతో అర్థమైంది.

అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏ హీరోకైనా అసహనమే. ఆ బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయకపోతే ప్రచారం చేయనంటూ వార్నింగ్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్?

సితార ఎంటర్ టైన్ మెంట్స్ చిన్న బ్యానర్ కాదు, ఆ నిర్మాతలకు మార్కెట్ కొత్త కాదు. తమ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి లాంటి క్యాలిక్యులేషన్స్ లో వాళ్లు పండిపోయారు. డబ్బింగ్ సినిమాకి  కూడా ఓ రేంజ్ లో స్ట్రాటజీ మెయింటైన్ చేసి రిలీజ్ చేసి, బ్రేక్-ఈవెన్ సాధించిన నిర్మాతలు వీళ్లు. ఇలాంటి నిర్మాతలకు విశ్వక్ సేన్ వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్.  

మొన్నటికిమొన్న నిఖిల్ కూడా ఇలానే వ్యవహరించాడు. స్పై సినిమా విడుదల తేదీ విషయంలో అసహనం వ్యక్తం చేస్తూ, పాక్షికంగా ప్రచారానికి దూరమయ్యాడు. ఇప్పుడు విశ్వక్ కూడా అలాంటి సంకేతాలే ఇస్తున్నాడు నిర్మాత నాగవంశీకి.

మరికొందరు మాత్రం విశ్వక్ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు, విశ్వక్ సేన్ ఇలా ఏదో ఒక వివాదాన్ని రేపుతాడని, సినిమా రిలీజ్ వరకు ఆ వివాదాన్ని కొనసాగించి లబ్ది పొందుతాడని అంటున్నారు.