పొలిటికల్ డ్రామాలను తెరకెక్కించడం అంటే అంతకు మించిన సాహసం ఉండదు. చాలా దేశాల్లో వీటికి ప్రేక్షకుల ఆమోదమే ఉండదు! ప్రేక్షకులకంటూ ఏదో ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైనా సినిమాలు తీస్తే వీరి మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి.
అలాగే జాతీయ అభిమానాలు, రాజకీయ అభిమానాలు, వీటికి తోడు మనదేశంలో అయితే కుల, మత అభిమానాలు.. ఇవన్నీ మంచి పొలిటికల్ డ్రామాను తెరకెక్కించనీయకుండా ఆపుతాయి. తీస్తే వన్ సైడెడ్ గా తీస్తూ పోతారు. గొప్ప రాజకీయ నేతలైనప్పటికీ వాళ్లకు ఫలానా బలహీనత ఉంది అని చూపించే ధైర్యం మన మూవీ మేకర్లకు ఉండదు.
అసలు అలాంటి ఆలోచనే ఉండదు. ఈ మధ్యకాలంలో వచ్చిన పొలిటీషియన్ల బయోపిక్ లు కూడా వార్ వన్ సైడే అన్నట్టుగా ఉంటుంది. ఒకటీ రెండు డైలాగులు అయితే ఆ రాజకీయ నేతల తీరుపై విమర్శనాత్మకంగా ఉంచినా, అంతకు మించి మాత్రం రెండో కోణం పెద్దగా కనపడదు.
గతంలో పాత సినిమాల్లో కొద్దో గొప్పో రాజకీయ విధానాలపైనైనా కాస్త డైలాగులు ఉండేవి. రోజు రోజుకూ మనోళ్లు మరీ సెన్సిటివ్ గా మారిపోతూ ఉండటంతో.. ఏ సిద్ధాంతాల మీదో స్పందించే ధైర్యం కూడా సినిమాల్లోని పాత్రలకు లేకుండా పోయింది.
ఈ జాడ్యం మనదేశానికే కాదు.. చాలా దేశాలకూ ఉంటుంది. అయితే… ఇలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని నిఖార్సైన పొలిటికల్ డ్రామాలొచ్చాయి. వాస్తవ పరిస్థితులు, నేతల వ్యక్తిత్వాలను చర్చకు పెట్టి.. వారిని ప్రజల ముందు కొత్తగా ఆవిష్కరించిన కొన్ని అరుదైన సినిమాలున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి డార్కెస్ట్ అవర్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలోని పరిణామాల ఆధారంగా.. నాటి బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది.
విన్ స్టన్ చర్చిల్.. తన స్పాంటేనివిటీతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న నేత. ఆయనతో రాజకీయ విబేధాలను కలిగిన వారు కూడా.. ఆయనను ఒక అపూర్వమైన వక్తగా ఒప్పుకుని తీరతారు. ఉర్రూతలూగించే రాజకీయ ప్రసంగాలను చేయడంలో.. విన్ స్టన్ చర్చిల్ చరిత్రలో ప్రత్యేకమైన నేత. విన్ స్టన్ చర్చిల్ ను ఒక సరదా వ్యక్తి గా అభివర్ణించే ఉదంతాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.
ఒక సమయంలో పార్లమెంట్ లో వాడీవేడీ చర్చ జరుగుతూ ఉండగా.. ఒక మహిళా బ్రిటీష్ పార్లమెంటేరియన్ లేచి.. 'నువ్వే నా భర్తవైతే నీకు కాఫీలో విషమిచ్చి చంపేదాన్ని..' అంటూ.. తీవ్రమైన ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిందట, ఆమె ఊగిపోతూ చేసిన విమర్శలను సరదాగా తీసుకున్న చర్చిల్ నువ్వే నా భార్యవు అయితే ఆ కాఫీని హ్యాపీగా తాగేసేవాడినంటూ ఆమె మళ్లీ నోరెత్తలేని రీతిలో చమత్కరంతోనే గట్టి సమాధానం ఇచ్చాడట.
అంతటి హ్యూమరస్ వ్యక్తి.. బ్రిటన్ ప్రధానిగా ఎలా వ్యవహరించాడు, అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన ఎలా నడుచుకునే వారు.. అనే అంశాలను అత్యంత హృద్యంగా చూపించిన సినిమా డార్కెస్ట్ అవర్!
చర్చిల్ ప్రధాని అయ్యే సమయానికి పరిస్థితి చాలా చాలా ఉద్రిక్తంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం పతాక స్థాయికి చేరుతూ ఉంది. నాజీ సేనలు విజృంభిస్తూ ఉన్నాయి. ఇతర యూరప్ దేశాలు బ్రిటన్ వైపు ఆశగా చూస్తున్నాయి. నాజీల దురాగాతాలను భరించలేక.. తాము ఎదురించలేక పలు దేశాలు బ్రిటన్ ను పెద్దన్నగా భావించాయి. కొందరు దేశాధినేతలే.. తమ దేశాలను నాజీలకు అప్పగించేసి… బ్రిటన్ లో తలదాచుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. జర్మనీని అన్ని రకాలుగా నియంత్రించాల్సిన బాధ్యత బ్రిటన్ మీద పడింది. ఈ విషయంలో విఫలం అయ్యాడని 1940 నాటి బ్రిటన్ ప్రధాని చాంబర్లీన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేసింది. ప్రతిపక్షం ఒత్తిడి తట్టుకోలేక చాంబర్లీన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రధాని పీఠంపై మరొకరిని కూర్చోబెట్టాల్సి వచ్చింది అధికార కన్సర్వేటివ్ పార్టీ. అధికార పార్టీ ప్రాబబుల్స్ లో అసలు చర్చిల్ పేరు లేనే లేదు. అయితే ప్రతిపక్ష పార్టీ మద్దతు కూడా కలిగిన అధికార పార్టీ సభ్యుడు కావడంతో చర్చిల్ కు ఆ అవకాశం వచ్చింది.
ఆయనకు పార్లమెంట్ లో, యూకే రాజకీయ వ్యవస్థలో ఉన్న నమ్మకం అంతంతమాత్రమే, అప్పటికే పార్టీ మారిన చరిత్ర ఉంది చర్చిల్ కు. అలాగే అప్పటి బ్రిటీష్ రాజు కింగ్ జార్జ్-6 కు కూడా చర్చిల్ పై అంత సానుకూల ధోరణి లేదు. ఇండియా, రష్యాల విషయంలో చర్చిల్ అభిప్రాయాలతో అతడి రాజకీయ విలువ మరింత తగ్గింది. ఇలా ఎవ్వరి నమ్మకాన్నీ పూర్తిగా పొందకుండానే, తన దేశం అత్యంత విపత్కాలంలో ఉండగా.. ప్రధాని బాధ్యతలను తీసుకున్నాడు చర్చిల్. అక్కడ నుంచి సినిమా మొదలవుతుంది.
సినిమాలో ప్రధాన పాత్రలు కొన్నే.. చర్చిల్, అతడి పర్సనల్ సెక్రటరీ, ఆయన భార్య.. ఇక మిగతా పాత్రలు వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. ఈ పాత్రల మధ్యన ఒక పొలిటికల్ డ్రామాను పండించారంటే.. ఈ సినిమా రచయితల పాటవాన్ని ఎంత అభినందించినా తక్కువే.
సినిమా ఆద్యంతం చర్చిల్ పాత్రను మాత్రమే చూపుతూ.. అతడితో వేరే వాళ్లు ఏం మాట్లాడారు, అతడు వేరే వాళ్లకు ఏం చెప్పారు, ఇతర రాజకీయనేతలు చర్చిల్ ను మొహం మీదే ఎలా విమర్శించారు, అన్ని వైపుల నుంచి ముప్పు చుట్టుముడుతున్న వేళ చర్చిల్ ఎలా ఎదుర్కొన్నాడు.. అనే అంశాలను చాలా గొప్ప రీతిలో చూపిన సినిమా ఇది.
డన్కిర్క్ లో చిక్కుకున్న బ్రిటన్ సైన్యాన్ని అక్కడ నుంచి తీసుకువచ్చిన అనంతరం చర్చిల్ చేసిన ప్రసంగం సినిమాలోని ఒక హైలెట్ పాయింట్. తప్పించుకుని రావడం.. యుద్ధంలో విజయం కాదంటూనే, అక్కడ నుంచి సైన్యాన్ని తీసుకురావడంలో తమ విజయాన్ని చాటుకుంటూ.. చర్చిల్ చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఆ ప్రసంగ పాఠాన్ని చర్చిల్ ఎలా తయారు చేసుకున్నాడు, ఎన్ని మార్పు చేర్పులు చేసుకున్నాడనే సీన్లు ఆసక్తిదాయకంగా ఉంటాయి.
చర్చిల్, అతడి పర్సనల్ సెక్రటరీ కమ్ టైపిస్ట్ తో సంభాషణలు, స్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రధాని రకరకాల విషయాల గురించి ఆమెకు డిక్టేట్ చేసే సన్నివేశాలు, తను చెప్పింది సరిగా వినిపించుకుని టైప్ చేయడం లేదని.. మొదటి సెక్రటరీని చర్చిల్ పంపించేయడం.. ఇలాంటి సన్నివేశాలన్నీ చాలా సరదాగా, హృద్యంగా ఉంటాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో ఒక దశలో బ్రిటన్ చేతులెత్తేసే పరిస్థితి కూడా వచ్చింది. హిట్లర్ తో రాజీ చర్చలు జరపాలంటూ వార్ కేబినెట్ కూడా చర్చిల్ కు తేల్చి చెబుతుంది. భీకరమైన ఆయుధ సంపత్తి, వ్యూహాలను అవలంభిస్తున్న నాజీ సేనలను ఎదుర్కొన లేమని.. ముందుగా రాజీ రాయబారంగా హిట్లర్ కు లేఖ రాయాలని చర్చిల్ కు సూచిస్తారు కొంతమంది బ్రిటీష్ రాజకీయ నేతలు.
తమ సైన్యం ఎక్కడిక్కడ చిక్కుబడుతూ ఉండటం, తమ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతూ ఉండటంతో.. చర్చిల్ కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి. అమెరికాను సాయం చేయాలంటూ కోరతాడు. రూజ్ వెల్డ్ కు ఫోన్ లైన్ కలుపుతాడు. అమెరికా సాయం కోసం చర్చిల్ రకరకాలుగా కోరి చూసినా.. అటు నుంచి ఎలాంటి సహకారం అందదు.
వార్ షిప్ లు, విమానాలు కావాలని చర్చిల్ కోరినా అమెరికన్ ప్రెసిడెంట్ చూద్దాం, చేద్దాం అంటాడు కానీ, ఎలాంటి సహకారానికి హామీ ఇవ్వడు. పెరల్ హర్బర్ పై దాడి జరిగేంత వరకూ అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ కాలేదనే విషయాన్ని ఇక్కడ ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి.
ఇక చేసేది లేక ఒక దశలో హిట్లర్ తో రాజీకి లేఖ రాయడానికి కూడా చర్చిల్ సిద్దం అవుతాడు. సినిమాలోని అత్యంత గంభీరమైన సన్నివేశం అది. అయితే పదాలతో ఆటాడుకుంటూ.. ఎలాంటి పరిస్థితికి అనుగుణంగా అయినా.. గొప్ప గొప్ప వాక్యాలను చెప్పగల వాగ్ధాటి ఉన్న చర్చిల్ .. జర్మన్ నియంతకు లేఖ రాసే సమయంలో మాత్రం మూగవాడవుతాడు.
హిట్లర్ ను ఏమని సంబోధించడానికి కూడా అతడికి పదాలు రావు. తీవ్రమైన విధ్వంసాన్ని, వినాశసాన్ని సృష్టిస్తూ, కొన్ని లక్షల మంది ప్రాణాలను తీస్తున్న హిట్లర్ ను ఫ్రెండ్ అనో, డియర్ అనో సంబంధించలేకపోతాడు. వినాశనాన్ని సృష్టిస్తున్న వ్యక్తితో రాజీ కోసమని అతడితో స్నేహపూర్వక సంభాషణ మొదలుపెట్టలేకపోతాడు.
లేఖ రాయాలని నిర్ణయించుకుని కూడా.. యుద్ధాన్ని తీసుకు వచ్చి, ఇంత దుర్మార్గానికి కారణమైన వ్యక్తి ని లెటర్ లోని తొలి వాక్యంలో మనస్ఫూర్తిగా పలకరించబుద్ధి గాక.. ఆ లేఖ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు చర్చిల్.
ప్రజల మధ్యకు వెళ్తాడు. లండన్ రైళ్లో ప్రయాణిస్తాడు. యుద్ధం పట్ల ప్రజల స్పందనను తీసుకుంటాడు. రేడియోలో వారికి ధైర్యాన్ని నింపుతాడు. డన్ కిర్క్ నుంచి సైన్యం ఇవక్యూయేషన్ పూర్తవుతుంది. ఆరో జార్జి కూడా చర్చిల్ కు పూర్తి మద్దతుగా నిలుస్తాడు. జర్మన్ సేనలకు వ్యతిరేకంగా పోరాడటానికి బ్రిటన్ మరింత తెగింపుతో రెడీ అవుతుంది. అన్ని రకాలుగానూ దారులు మూసుకపోతున్న తరుణంలో కూడా చర్చిల్ చూపిన తెగువతో యుద్ధం కొనసాగుతుంది. రాజీ ఆలోచనలు మానుకుని.. ముందుకే వెళ్లడానికి నిర్ణయించుకోవడంతో సినిమా ముగుస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో కీలక సమయం అంతా చర్చిల్ యూకే ప్రధానిగా ఉన్నా.. ఈ సినిమాను అంత లెంగ్తీగా చూపలేదు. చర్చిల్ ప్రధానిగా ఎన్నికైన పరిస్థితులు, అతడు తొలి ఏడాది లోపు ఎదుర్కొన్న పెను సవాళ్లు, ఆ సమయంలో బ్రిటన్ అన్ని రకాలుగానూ కార్నర్ కావడం, నాజీలు బ్రిటన్ సైన్యాన్ని దెబ్బతీయడం, ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా చర్చిల్లో ధీమా సడలకపోవడం, తనలో ఉన్న ధైర్యాన్ని మాటలుగా ప్రవహింపజేసి చర్చిల్ ప్రజలను, సైన్యాన్ని ఉత్తేజితం చేయడం.. తదితర అంశాలను సినిమాలో చాలా భావోద్వేగ పూరితంగా చూపించారు.
అలాగే చర్చిల్, ఆయన భార్య అనుబంధాన్ని… ఆ వృద్ధ దంపతులు 'పిగ్' అంటూ పిలుచుకుంటూ తమ ఆప్యాయతను చాటుకునే వైనాన్ని, పర్సనల్ సెక్రటరీతో చర్చిల్ సరదాగా వ్యవహరించే తీరును.. చూపుతూ సినిమాను హ్యూమరస్ గా మార్చారు.
ప్రధానిగా చర్చిల్ తొలి ఏడాది కాలానికి సంబంధించిన ఈ సినిమా ముగింపులో.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో చర్చిల్ ప్రాతినిధ్యం వహించిన పార్టీ ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తారు. యుద్ధ సమయంలో నాయకుడిగా.. రెండో ప్రపంచ యుద్ధ విజేతగా బ్రిటన్ ను నిలిపినప్పటికీ.. యుద్ధం అనంతరం తొలి ఎన్నికల్లోనే చర్చిల్ నాయకత్వంలోని పార్టీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చారు. ఈ విషయాలన్నింటినీ చెబుతూ సినిమా ముగుస్తుంది.
ఇక ఈ సినిమా కోసం చర్చిల్ బతికొచ్చి నటించాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది ప్రధాన పాత్రధారుడిని చూస్తే. అసలు చర్చిల్ తో ఏ మాత్రం పోలికల్లేని గ్యారీ ఓల్డ్ మన్ ను చర్చిల్ గా చూపించే ఆలోచనే చిత్రమైనది. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్టుగా, స్వయంగా చర్చిల్ ఈ సినిమాలో నటించినట్టుగా.. ఆ పాత్రను అత్యద్భుతంగా ప్రదర్శించాడు గ్యారీ ఓల్డ్ మన్. అందుకు గానూ అతడు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును కూడా పొందాడు.
-జీవన్ రెడ్డి.బి