అడ్రస్ అడిగితే.. డోర్ నెంబర్, ఇంటి నెంబర్, వీధి పేరు, ఊరు పేరు, పిన్ కోడ్.. ఇలా అన్నీ చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇకపై అలాంటి అవసరం లేదు. హైదరాబాద్ సహా.. తెలంగాణలోని అన్ని మున్సిపాల్టీల్లో ఇంటి అడ్రస్ లు డిజిటల్ రూపంలోకి మారిపోతున్నాయి.
ఇకపై అడ్రస్ అడిగితే.. చెప్పడం, మెసేజ్ చేయడం కాదు, క్యూఆర్ కోడ్ ఫార్వార్డ్ చేస్తే చాలు.. రావాల్సిన వారు నేరుగా ఇంటిముందే ల్యాండయిపోతారు. గూగుల్ లొకేషన్ షేర్ చేసినట్టు, క్యూఆర్ కోడ్ షేర్ చేస్తే దాని ఆధారంగా నేరుగా ఇంటికే వచ్చేయొచ్చు.
దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన క్యూఆర్ కోడ్ డిజిటల్ ఇంటి నెంబర్ల విధానాన్ని హైదారాబాద్ లో కూడా తెరపైకి తేబోతున్నారు. ఏపీలో చంద్రబాబు హయాంలో ఇలాంటి డిజిటల్ ఇంటి నెంబర్ల విధానాన్ని తీసుకొచ్చినా అది అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.
ఇంటి ముందు క్యూఆర్ కోడ్ బోర్డు బిగించినందుకు ప్రభుత్వం కమీషన్లు ఇచ్చింది కానీ, వాటిని ఉపయోగించుకోలేకపోయింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో డిజిటల్ ఇంటి నెంబర్లతోపాటు.. అడ్రస్ ని కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయబోతున్నారు. క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తామని చెబుతున్నారు.
ముందుగా చిన్న చిన్న పట్టణాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని తెలిపారు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. ఆ తర్వాత అన్ని మున్సిపాల్టీల్లో అమలు చేస్తామని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ అనేది మనిషి జీవితంలో భాగంగా మారింది.
కూరగాయలు తీసుకుని 10 రూపాయలివ్వాలన్నా.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్న రోజులివి. కటింగ్ సెలూన్లు, బట్టల షాపులు, మందుల షాపులు, ఆఖరికి వైన్ షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ లు దర్శనమిస్తున్నాయి.
కేవలం నగదు లావాదేవీలకే కాకుండా సమాచార మార్పిడికి కూడా వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఇంటి అడ్రస్ లు ఇప్పుడు క్యూఆర్ కోడ్ రూపంలోనే ఉంటున్నాయి. మనదేశంలో కూడా కొన్ని ప్రధాన నగరాల్లో ఈ విధానం అమలులో ఉన్నా.. పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన లేదు. ఎక్కువగా గూగుల్ లొకేషన్ షేర్ విధానంతోనే పని పూర్తి చేస్తున్నారు.
ఇకపై ఇంటి అడ్రస్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో వస్తే.. సారీ, రాంగ్ అడ్రస్ కి వచ్చాం అనే అవకాశమే ఉండదన్నమాట. హైదరాబాద్ లో మీరెక్కడుంటారు అని అడగడం ఆపేసి.. హైదరాబాద్ లో మీ క్యూఆర్ కోడ్ ఏంటి అని అడిగే రోజులు రాబోతున్నాయి.