ఏపీలో మత రాజకీయాలు చేయాలని, ఇప్పటికే కులాల వారిగా విడిపోయిన ఓట్లను, మతాల ప్రాతిపదికన వర్గీకరించి లబ్ధి పొందాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు, ఫలించబోవు కూడా.
ఉత్తరాదిలో ప్రజల్ని రెచ్చగొట్టినంత సులువుగా ఏపీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కుదరదనే విషయం ఈపాటికే అధినాయకత్వానికి కూడా అర్థమైంది. అయితే తమ జెండా, అజెండా రెండూ మతమే కావడంతో ఆ మార్గంలోనే పోవాలని చూస్తోంది. రాష్ట్ర బీజేపీని కూడా ఆ ట్రాక్ తప్పొద్దని గట్టిగా సూచనలిచ్చింది.
ఆమధ్య ఓ పచ్చపాత పత్రిక రామతీర్థం విషయాన్ని హైలెట్ చేస్తూ.. రాష్ట్ర బీజేపీకి, కేంద్ర నాయకత్వం తలంటిందని రాసుకొచ్చింది. రామతీర్థం వ్యవహారంలో టీడీపీ మైలేజీ పొందిందని, బీజేపీ మాత్రం వెనకపడిందని, ఈమేరకు రాష్ట్ర నాయకులకు కేంద్ర పెద్దలు చీవాట్లు పెట్టారని కూడా ఓ వార్తను వండివార్చింది.
ఆ సంగతి నిజమో కాదో తెలియదు కానీ, ఏపీలో మత చిచ్చు పెట్టడానికి కేంద్రం డైరక్షన్ లోనే రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తుందనే విషయం మాత్రం అర్థమవుతోంది.
మత విద్వేష దండయాత్ర..
రామతీర్థం ఘటనలో దోషులెవరో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఆలయాల ఘటనల్లో టీడీపీ-బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు కేసులు పెట్టారు. దీంతో బీజేపీ మరింత రెచ్చిపోయింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా అంటూ తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం రామతీర్థం వరకు 8 రోజుల పాటు ప్రత్యేక యాత్ర డిజైన్ చేశారు.
ఫిబ్రవరి 4నుంచి ఈ యాత్ర మొదలవుతుందని, దాడులు జరిగిన ఆలయాలన్నిటినీ కలుపుతూ బీజేపీ శ్రేణులు ముందుకెళ్తాయని ప్రకటించారు. జనసేన పాత్ర గురించి చెప్పలేదు కానీ, మత విద్వేష యాత్రను మాత్రం మహ బాగా ప్లాన్ చేసింది కమలదళం.
రామతీర్థం ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఎన్ని విద్వేషకర పోస్టింగ్ లు పెట్టారో లెక్కే లేదు. మా రాముడి జోలికొస్తారా అంటూ ఆడవాళ్లతో ఆవేశంగా మాట్లాడించారు, మీరసలు హిందువులేనా అంటూ జనాల్ని రెచ్చగొట్టారు.
ఇంకోచోట ఇలా చేస్తే ఏం జరిగేదో తెలుసా అంటూ కవ్వించారు. కానీ ఎక్కడా ఏపీలో అలజడులు చెలరేగలేదు. జనసేన పిలుపిచ్చిన ఒకరోజు యాత్ర కూడా అర్థాంతరంగానే ముగిసింది.
ఈ నేపథ్యంలో ఏపీలో మత రాజకీయాలు అంత ఈజీ కాదని బీజేపీ అధినాయకత్వానికి అర్థమైంది. అందుకే ఈ 8 రోజుల యాత్రతో మరికాస్త రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మత రాజకీయాలకు ఏపీ ప్రజలు ఎలా లొంగరో చూస్తాం.. అన్నట్టుగా ఉంది బీజేపీ ధోరణి.