బాబోయ్ మాకు ఏజెంట్-2 వద్దు!

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. అక్కినేని ఫ్యాన్స్ మొహాలు వాడిపోయాయి. అయితే అంతలోనే అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఖంగుతింది. సోషల్ మీడియాలో లబోదిబోమంటోంది. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి బన్నీ ఫ్యాన్స్ కు…

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. అక్కినేని ఫ్యాన్స్ మొహాలు వాడిపోయాయి. అయితే అంతలోనే అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఖంగుతింది. సోషల్ మీడియాలో లబోదిబోమంటోంది. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి బన్నీ ఫ్యాన్స్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏజెంట్ అనే సినిమా ఇప్పుడు అల్లు ఆర్మీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. త్వరలోనే బన్నీ-సురేందర్ రెడ్డి కాంబో అంటూ కొత్త టాక్ మొదలైంది. ఈ టాక్ మొదలవ్వడమే ఆలస్యం అల్లు అర్జున్ అభిమానులు నిరసన తెలపడం స్టార్ట్ చేశారు. మాకు ఏజెంట్-2 వద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో గోల చేయడం మొదలుపెట్టారు.

నిజానికి మొన్నటివరకు ఈ కాంబినేషన్ పై పాజిటివ్ వైబ్రేషన్ నడిచింది. రేసుగుర్రం కాంబో కలిస్తే మరోసారి బాక్సులు బద్దలవుతాయని స్వయంగా బన్నీ ఫ్యాన్సే సంబర పడ్డారు. ఎప్పుడైతే ఏజంట్ సినిమా ఫ్లాప్ అయిందో, అప్పట్నుంచి సురేందర్ రెడ్డితో సినిమా వద్దంటూ బన్నీకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞాపనలు ఎక్కువయ్యాయి. గతంలో ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా బన్నీ-కొరటాల కాంబోపై ఇలాంటి నిరసన కార్యక్రమమే జరిగింది. 

బన్నీ ఫోకస్ మొత్తం పుష్ప-2 సినిమాపైనే ఉంది. ఆ మూవీ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లిస్ట్ లో ముందుగా త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత వేణు శ్రీరామ్, సందీప్ రెడ్డి వంగ పేర్లు ఉన్నాయి. వీళ్లంతా ఓకే కానీ, సురేందర్ రెడ్డితో మాత్రం సినిమా వద్దంటున్నారు అభిమానులు.