పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ సర్కార్ గౌరవించింది. అధికారిక లాంఛనాలతో సన్మానించింది. పద్మ అవార్డు గ్రహీతలందరికీ సన్మాన పత్రాలు అందించింది. అలా తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి గౌరవ మర్యాదలు అందుకున్నారు చిరు. ఇక మిగిలింది టాలీవుడ్ వంతు మాత్రమే.
చిరంజీవి కోసమైనా టాలీవుడ్ కలుస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. అన్ని బేషజాలు పక్కనపెట్టి, అభిప్రాయబేధాలకు తావులేకుండా, అందరూ ఒక తాటిపైకి వచ్చి చిరంజీవిని సన్మానించాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి టాలీవుడ్ సంస్థల నుంచి ఇప్పటివరకు అలాంటి క్లారిటీ ఏదీ రాలేదు.
టాలీవుడ్ కు చెందిన కొంతమంది ఇప్పటికే చిరంజీవిని వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు. అభినందనలు తెలిపారు. చిరంజీవిని కలిసింది ఎవరో, ఇప్పటివరకు ఆయన్ను కలవకుండా చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది ఎవరో అందరికీ తెలుసు.
పైకి చెప్పుకోనప్పటికీ, వ్యక్తిగతంగా కలవనప్పటికీ ఫోన్ చేసి చిరంజీవిని అభినందించిన వాళ్లు కొంతమంది ఉన్నారు. చిరు గొప్పదనాన్ని బహిరంగంగా అంగీకరించడం వాళ్లకు ఇష్టముండదు. చిరంజీవి కోసం బయటకొస్తే, తమకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందేమో అని మరికొంతమంది భయం. చిరంజీవిని అభినందించడానికి వాళ్ల ఇంటికెళ్తే, ఇండస్ట్రీలో మరో కోటరీకి కోపం వస్తుందని, బిజినెస్ దెబ్బతింటుందని మరికొందరి భయం.
ఇలా రకరకాల భయాలు, ఆందోళనలతో కొంతమంది తెరవెనక ఉండిపోతున్నారు. అలాంటి వాళ్లంతా బయటకు రావాలి. చిరంజీవిని సత్కరించడం ద్వారా ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని చాటిచెప్పాలి.