పవన్ కల్యాణ్ పాత సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఇటు ప్రభాస్ పాత సినిమాలు కూడా కొన్ని ఆల్రెడీ రీ-రిలీజ్ అయ్యాయి. దీంతో ఇప్పుడిదో ట్రెండ్ గా మారింది. చిరంజీవి-బాలయ్య పాత సినిమాలు కూడా కొన్ని థియేటర్లలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. వెంకీ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది
వెంకటేషన్ నటించిన పాత సినిమాల్లో ఏవి రీ-రిలీజ్ చేస్తే బాగుంటుందనే చర్చను మొదలుపెట్టారు దగ్గుబాటి అభిమానులు. ఇందులో భాగంగా చాలా సినిమాలు తెరపైకొచ్చాయి కానీ, వాటిని ఈ కాలం విడుదల చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానంలో అందరూ పడిపోతున్నారు.
నిజానికి సీనియర్లలో మిగతా హీరోలతో పోలిస్తే, సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరో వెంకటేశ్. ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు వెంకీ. అయితే అలా ఇచ్చిన హిట్స్ అన్నీ అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఉన్నవే తప్ప, మాస్-మసాలా యాక్షన్ మూవీస్ కాదు. దీంతో వాటిని మళ్లీ విడుదల చేస్తే క్రేజ్ కంటే కామెంట్స్ ఎక్కువ వస్తాయేమో అని భయపడుతున్నాయి అభిమాన సంఘాలు.
వెంకీ నటించిన నారప్ప సినిమాను ఓ రకంగా రీ-రిలీజ్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అది ముందుగా ఓటీటీలో రిలీజైంది. ఆ తర్వాత అతడి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ప్రాపర్ రీ-రిలీజ్ కోసం వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఘర్షణ, జెమినీ, ధర్మచక్రం, బొబ్బిలి రాజా లాంటి సినిమాలపై సీరియస్ డిస్కషన్ జరుగుతోంది.
త్వరలోనే వెంకీ నుంచి ఏ సినిమాలు రీ-రిలీజ్ అవుతాయనే విషయంపై స్పష్టత వస్తుంది.