ఆయనేమో 86ఏళ్ల వృద్ధుడు. కాపులకు రిజర్వేషన్ లు అమలు చేసి తీరాలని నిరాహారదీక్ష చేయదలచుకున్నాడు. అంత పెద్దాయన అలాంటి తీవ్ర నిర్ణయానికి రావడం ఆరోగ్యానికి ప్రమాదం గనుక.. పోలీసులు ముందుగానే ఆయనను ఆస్పత్రిలో పెట్టి చికిత్స ఏర్పాటుచేశారు. ఆయన మాత్రం నేను దీక్షలోనే ఉన్నా అని వెల్లడించారు. ఈలోగా జనసేనాని పవన్ కల్యాణ్ ఫోను చేయడం.. ‘ఈ మూర్ఖపు ప్రభుత్వంతో పోరాటానికి మీరు ఈ వయసులో ప్రాణాలను పణంగా పెట్టొద్దు. మరోసారి ఆలోచించి ఎలా పోరాడాలో నిర్ణయం తీసుకుందాం. మీరు దీక్ష విరమించండి’ అని కోరడం.. పవన్ కల్యాణ్ నుంచి సదరు ఫోన్ కాల్ కోసమే దీక్షను ప్రారంభించినట్టుగా ఆ వెంటనే జోగయ్య విరమించడం.. ఈ పరిణామాలన్నీ కూడా నాటకంలో సన్నివేశాల్లాగా ఒకదానివెంట ఒకటి జరిగిపోయాయి.
కాపుల మీద వెల్లువెత్తే ప్రేమతో ఏదో చేసేస్తున్నట్టు నడిచిన ఈ డ్రామా ఏమిటో అర్థం కాక కాపులే తలలు పట్టుకుంటున్నారు. ఇంతకూ హరిరామజోగయ్యకు పవన్ మాటల్లో భరోసా కనిపించిందా? లేదా తన ప్రాణాల మీద భయం కనిపించిందా అని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ తీరుమీద కాపునేతల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి.
1) హరిరామజోగయ్య దీక్ష నిర్ణయానికి వచ్చినప్పుడే.. ఆయన వయసు 86 అనే సంగతి పవన్ కు తెలుసు కదా. ఇప్పుడిచ్చిన హామీ అప్పుడే ఇచ్చి ఆయనను శాంతింపజేసి ఉండాలి గానీ.. ఈ రెండు రోజుల హైడ్రామా ఏమిటి?
2) ఇంతకూ పవన్ కల్యాణ్ జోగయ్యకు ఇచ్చిన హామీ ఏమిటి? ‘ఎలా పోరాడాలో నిర్ణయం తీసుకుందాం’ అని మాత్రమే చెప్పారా? తాను కూడా వెంటఉండి పోరాడుతానని అన్నారా? కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా తన జనసేన పార్టీ తరఫున బహిరంగంగా పోరాడడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారా? లేదా?
3)కాపు రిజర్వేషన్ లకు పవన్ కల్యాణ్ అనుకూలమే అయితే.. 2024 తర్వాత.. తన పార్టీ అధికారంలోకి వచ్చినా, లేదా, జనసేన భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పడినా తక్షణం కాపు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం అనే హామీ ఆయన ఇవ్వగలరా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే మాత్రమే పవన్ కల్యాణ్ ను నమ్మాలని.. లేని పక్షంలో ఆయన కేవలం హరిరామజోగయ్యను మాత్రమే కాకుండా, తమ రిజర్వేషన్ లను సాధించుకోవడానికి పోరాటపథంలో ఉన్న యావత్ కాపుకులస్తులను కూడా వంచిస్తున్నారని పలువురిలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కల్యాణ్.. స్వతహాగా తనకు కాపు ఓట్లన్నీ గంపగుత్తగా పడాలని కోరుకుంటారు. కానీ, కాపులకోసం ఒక్క మాటైనా ఓపెన్ గా మాట్లాడరు. పోరాటం సంగతి సరేసరి.. ఇదేం ద్వంద్వవైఖరి అని కూడా పలువురు విమర్శిస్తున్నారు.