చంద్రబాబు సభల పుణ్యమా అని ఇకపై రోడ్ల మీద సభలు, సమావేశాలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. బాబు సభల నిర్వహణలో అలసత్వం, బాధ్యతారాహిత్యం …చివరికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బాబు ఐరన్ లెగ్ ఎఫెక్ట్ అనే చర్చకు తెరలేచింది. ఇక మీదట రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఊరి బయట మైదానాల్లో మాత్రమే కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసలే ఇది ఎన్నికల సీజన్. ఈ నేపథ్యంలో హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చాయి. ఆ ఉత్తర్వుల్లో ఏముందంటే… జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదు. మరీ అత్యవసరమైతే సంబంధిత జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు షరతులతో కూడిన అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీ హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. టీడీపీ నేతల బాధ్యతా రాహిత్యం, చంద్రబాబు ప్రచార యావ వెరసి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో రహదారులపై సభలు, ర్యాలీల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ఏపీ సర్కార్ ముందుకు రావడం అభినందించాలి.
అయితే నిబంధనల అమల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా నిబంధనలు అమలు చేస్తే విమర్శలపాలవుతారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. రానున్న రోజుల్లో లోకేశ్ పాదయాత్ర, అలాగే పవన్‌కల్యాణ్ వాహన యాత్ర, చంద్రబాబు ఎన్నికల ప్రచార యాత్రల నేపథ్యంలో వారిపై భారీ ఎఫెక్ట్ పడనుంది. అలాగే త్వరలో జనంలోకి రానున్న జగన్‌పై కూడా ఆయన ప్రభుత్వ నిబంధనలు ప్రభావం చూపనున్నాయి.