అయిన‌నూ పోయి రావలె కుప్పానికి!

అయిన‌నూ పోయి రావ‌లె కుప్పానికి అని చంద్ర‌బాబు అంటున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకు పుట్టించాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మిగిల్చిన చేదు ఫ‌లితాలు చివ‌రికి త‌న ఉనికికే ప్ర‌మాదం…

అయిన‌నూ పోయి రావ‌లె కుప్పానికి అని చంద్ర‌బాబు అంటున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు చంద్ర‌బాబు వెన్నులో వ‌ణుకు పుట్టించాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మిగిల్చిన చేదు ఫ‌లితాలు చివ‌రికి త‌న ఉనికికే ప్ర‌మాదం తెచ్చేలా ఉంద‌ని చంద్ర‌బాబు గ్ర‌హించారు. పైగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వై నాట్ 175 నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు. జ‌గ‌న్ టార్గెట్ చేస్తే, సాధించే వ‌ర‌కూ విడిచిపెట్ట‌ర‌నే భ‌యం చంద్ర‌బాబును కుదురుగా వుండ‌నివ్వ‌డం లేదు.

దీంతో ప్ర‌తి రెండు నెల‌ల‌కు ఒక‌సారి చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పానికి గ‌త కొంత కాలంగా వెళ్లి వ‌స్తున్నారు. చంద్ర‌బాబు చివ‌రి కుప్పం ప‌ర్య‌ట‌న‌లో అల‌జ‌డి చెల‌రేగింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ శ్రేణులు దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. అన్న క్యాంటీన్‌ను బాబు ప్రారంభించ‌డానికి కొన్ని గంట‌ల ముందు వైసీపీ శ్రేణులు రాద్ధాంతం చేశాయి. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వెళుతున్నారు. శుక్ర‌వారం వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా బాబు ప‌ర్య‌టిస్తారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల నాయ‌కుల‌తో ఆయ‌న భేటీ కానున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో అడిగి తెలుసుకోనున్నారు. గ్రామ స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేజార కుండా చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

కుప్పంలో మ‌రెవ‌రికో బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వ‌ల్ల న‌ష్టపోయి న‌ట్టు ఆయ‌న గ్ర‌హించారు. దీంతో తానే కుప్పంలో ఏం జ‌రుగుతున్న‌దో తెలుసుకుంటున్నారు. అంద‌రితో మాట్లాడుతూ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.