చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ త్వరలో యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్… యువ ట్యాగ్‌లైన్‌తో త్వరలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో సభ నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను విడుదల చేశారు.
దత్తపుత్రుడు, సొంత పుత్రుడి కార్యక్రమాల్లో కామన్‌గా “యువ” ఉండడం విశేషం. అయితే పేరులోనే తప్ప, ఆచరణలో యువకుల్లో కనిపించే ఉత్సాహం, ఉద్రేకం, చురుకుదనం ఇద్దరు నేతల్లో పెద్దగా కనిపించవు. అప్పుడప్పుడు పవన్‌కల్యాణ్ ఆవేశపడుతుంటారు. కానీ లోకేశ్‌లో మాత్రం మచ్చుకైనా యువ లక్షణాలు కనిపించవనే బలమైన విమర్శవుంది. ఒక వైపు 70 ఏళ్ల పైబడిన వయసులో చంద్రబాబు పార్టీని కాపాడుకోడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికీ ఊరూరు తిరుగుతూ తన శక్తికొద్ది పని చేస్తున్నారు.
అదేంటోగానీ లోకేశ్ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఇంకా తండ్రి సాధించిపెడితే అనుభవించాలనే దశలోనే లోకేశ్ ఉన్నారు. ఇదే రీతిలో దత్తపుత్రుడు కూడా ఉన్నారనే విమర్శ. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే తాను రాజకీయంగా ఉనికి చాటుకోగలననే ఆశ తప్ప, సొంతంగా సాధించాలనే పట్టుదల, కసి పవన్‌కల్యాణ్‌లో అసలు కనిపించవు. చంద్రబాబు శ్రమపై అధికార సౌధాన్ని నిర్మించాలనే ఆశయంతో పవన్ ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇలాంటి వాళ్లు తమ కార్యక్రమాలకు యువ అనే ట్యాగ్‌ను తగిలించుకుని, బిల్డప్‌లు ఇవ్వడం వారికే చెల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరేమో షూటింగ్‌లు, మరొకరేమో సోషల్ మీడియాలో నిత్యం లీనమై వుంటారు. ఈ బిల్డప్ యువ లీడర్స్‌ను చూస్తే… ఔరా అనిపించక మానదు.