లావణ్య-వరుణ్.. ప్రేమను ఎందుకు బయటపెట్టలేదు?

ఇలా ప్రేమలో పడితే అలా గొప్పగా బయటకు చెప్పుకునే రోజులివి. అలాంటిది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాత్రం  ఏళ్లుగా ప్రేమించుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. తమ ప్రేమ విషయాన్ని ఈ జంట…

ఇలా ప్రేమలో పడితే అలా గొప్పగా బయటకు చెప్పుకునే రోజులివి. అలాంటిది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాత్రం  ఏళ్లుగా ప్రేమించుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. తమ ప్రేమ విషయాన్ని ఈ జంట ఎందుకు అంత సీక్రెట్ గా ఉంచింది? దీనికి రీజన్ చెప్పాడు వరుణ్ తేజ్.

“మాక్కూడా బయటకెళ్లాలని, డిన్నర్స్ చేయాలని అనిపించేది. కానీ చాలా త్యాగం చేశాం. ఎందుకంటే, మా రిలేషన్ షిప్ పై చర్చ మొదలైనప్పుడు, అది మా బంధంలో ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందేమో అని భయం. అందుకే సీక్రెట్ గా ఉంచాం.”

తమ లవ్ మేటర్ ను బయటకు చెప్పకూడదు అనే నియమం పెట్టుకోలేదని, కాకపోతే వ్యక్తిగత విషయాల్ని వ్యక్తిగతంగా ఉంచడమే తనకు ఇష్టమని అన్నాడు వరుణ్ తేజ్. కుటుంబ సభ్యులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే భయంతోనే రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా ఉంచారనే ప్రచారాన్ని ఈ సందర్భంగా తిప్పికొట్టాడు.

“ప్రేమ వ్యవహారంలో మా ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఓపెన్ గా ఉంటారు. నా నిర్ణయాన్ని వాళ్లు నమ్ముతారు. లావణ్య ఇంట్లో కూడా తనను బాగా నమ్ముతారు. చాలా చిన్న వయసులోనే తను ఇంట్లోంచి బయటకొచ్చి వృత్తి రీత్యా ముంబయి, హైదరాబాద్ లో ఉండేది. లావణ్య తీసుకునే నిర్ణయాల్ని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ గౌరవిస్తారు. మా ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.”

లావణ్య త్రిపాఠికి తనంటే ఇష్టమనే విషయం తెలిసినప్పటికీ, ముందుగా తనే ప్రపోజ్ చేశానని వెల్లడించాడు వరుణ్ తేజ్. ఈ 5-6 ఏళ్లలో చాలా బహుమతులు ఇచ్చుకున్నామని, ప్రస్తుతం తను వాడుతున్న ఫోన్, లావణ్య గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాడు.