తె కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు చాలా చీప్ గురూ!

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. సెప్టెంబరు నెలలోనే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించాలని కూడా పార్టీ అనుకుంటోంది. ఎమ్మెల్యే టికెట్లు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని తె కాంగ్రెస్…

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. సెప్టెంబరు నెలలోనే తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించాలని కూడా పార్టీ అనుకుంటోంది. ఎమ్మెల్యే టికెట్లు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని తె కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు.. అందుకు నిర్ణీత రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. 

ఓసీ, బీసీ వర్గాలకు చెందిన వారు 50 వేలు, ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులు అయితే 25 వేలు రుసుము చెల్లించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అప్లికేషన్ ఫీజు వసూలు చేయడం కొత్తగా కనిపిస్తుండవచ్చు గానీ.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు చాలా చీప్ గురూ.. అని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్ కూడా.. అచ్చంగా కర్నాటక బాటనే అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.,. పార్టీ టికెట్ కోసం అప్లికేషన్లతో పాటు ఫీజు సేకరించడం అనేది అక్కడే జరిగింది. కాకపోతే కన్నడ కాంగ్రెస్ టికెట్ల ధర చాలా ఎక్కువ. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ రూ. రెండు లక్షలు ఫీజు చెల్లించాలని అక్కడ వసూలు చేశారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు యాభై శాతం కన్సెషన్ ఇచ్చారు. ఇలా ఆశావహుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణానికి, పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు కన్నడ కాంగ్రెస్ పెద్దలు అప్పట్లో ప్రకటించారు. 

అక్కడి ఫీజుతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ ధరలు నిర్ణయించారు. యాభైవులు, పాతిక వేలు మాత్రమే. నిజానికి తెలంగాణలో కూడా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాగలం అనే నమ్మకంతోనే కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. కేసీఆర్ సర్కారును మట్టి కరిపించగలం అని భావిస్తోంది. 

ఇలాంటి సమయంలో.. ఆషామాషీగా పార్టీ టికెట్ల కోసం ఓ దరఖాస్తు పడేసి.. నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండే నాన్ సీరియస్ నేతలను తొలిదశలో వడపోత పోయడానికి ఇలా రుసుములు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 

నిజానికి ఓసీ అభ్యర్థులనుంచి రూ. పదివేలు, ఎస్సీ ఎస్టీల నుంచి ఐదు వేలు మాత్రమే వసూలు చేయాలని తొలుత అనుకున్నారు. అయితే అది చివరికి 50, 25 వేలుగా డిసైడ్ అయింది. అప్లికేషను కే డబ్బు కట్టి.. ఎందరు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటారో.. డబ్బు కూడా కట్టిన తర్వాత.. వారినుంచి ఒత్తిడి, భారీ డిమాండ్లు ఎలా ఉండబోతాయో, వాటిని పార్టీ నాయకత్వం ఎలా సంబాళిస్తుందో వేచిచూడాలి.