తె-బిజెపికి పొంచి ఉన్న పెద్ద గండం!

కొంత కాలంగా ఉసూరుమన్నట్టుగా సాగుతున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు త్వరితగతిన సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కొన్ని నెలల కిందట తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సమరోత్సాహం నింపడానికి ఆ పార్టీ…

కొంత కాలంగా ఉసూరుమన్నట్టుగా సాగుతున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు త్వరితగతిన సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కొన్ని నెలల కిందట తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సమరోత్సాహం నింపడానికి ఆ పార్టీ ప్లాన్ చేసిన అమిత్ షా బహిరంగ సభ ఇప్పుడు జరగబోతోంది. ముందు అనుకున్న వేదిక ఖమ్మం లోనే ఈనెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఈ సభా నిర్వహణ పార్టీకి కత్తి మీద సాములాగా, నాయకులకు పెద్ద గండం లాగా మారుతుంది.

ఖమ్మంలో ఇప్పటికే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ముగ్గురూ కూడా వేరువేరుగా బహిరంగ సభలు నిర్వహించారు. ఒకరకంగా చెప్పాలంటే అన్ని పార్టీల సభలు విజయవంతమే అయ్యాయి. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభగా కెసిఆర్ ఖమ్మంలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్. 

అలాగే కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క సాగించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో కూడా కలిపి ఖమ్మంలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభ కూడా అద్భుతంగానే విజయవంతం అయింది. తెలంగాణలో తెలుగుదేశం పని అయిపోయిందని అందరూ నమ్ముతుండగా ఖమ్మంలో చంద్రబాబు నిర్వహించిన సభ మాత్రం బాగానే జరిగింది.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ సర్కారును మట్టికరిపించి తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రతినలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో నిర్వహించే సభ ఏ స్థాయిలో ఉండబోతోంది? అనేది చాలా కీలకమైన అంశం. సాధారణంగానే ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి బలం తక్కువ. ఈ విషయాన్ని ఆ పార్టీ చేరికల కమిటీ సారధి ఈటల రాజేందర్ స్వయంగా గతంలో ప్రకటించారు కూడా. అలాంటి నేపథ్యంలో ఇక్కడ సభా నిర్వహణ వారికి కత్తి మీద సాము. జన సమీకరణ చేయడానికి కమల నాయకులు కిందామీదా పడుతున్నారు.

గతంలో రెండుసార్లు ఇక్కడ అమిత్ షా సభ వాయిదా పడింది. ఈ రెండు సందర్భాల్లో కూడా జన సమీకరణకు చివరి దాకా ఏర్పాట్లు చేసి డబ్బు ఖర్చు చేసి చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మూడోసారి ఖర్చు పెట్టడం నాయకులకు భారమే. పైగా కెసిఆర్, రాహుల్ సభలను తలదన్నేలా నిర్వహించకపోతే బిజెపికి ఉన్న పరువు పోతుంది. 

ఘనంగా ఒక సభ పెట్టలేని వారు అధికారంలోకి ఎలా వస్తారని నెగటివ్ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం సభను విజయవంతం చేయడానికి బిజెపి నాయకులు నానా పాట్లు పడుతున్నారు.