రాలిపోయే గులాబీల కోసం ఎదురుచూపులు!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంతో కాలం నుంచి ఎన్నికలకు తాము సిద్ధం అన్నట్లుగా ప్రనకటించుకుంటూ వస్తోంది. కేసీఆర్ ఓటమి భయంతో ముందస్తు ఎన్నికలకు వెళతారని, ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా తమ పార్టీ…

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంతో కాలం నుంచి ఎన్నికలకు తాము సిద్ధం అన్నట్లుగా ప్రనకటించుకుంటూ వస్తోంది. కేసీఆర్ ఓటమి భయంతో ముందస్తు ఎన్నికలకు వెళతారని, ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా తమ పార్టీ సిద్ధం అని.. కమల నాయకులు ఏడాదికి పైగా ఊదరగొడుతున్నారు. ముందస్తు అనే మాట లేకపోగా.. కేసీఆర్ ఎంచక్కా.. షెడ్యూల్డు సమయానికే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. 

నేడో రేపో వారి తొలి జాబితా కూడా విడుదల కాబోతోంది. అదే సమయంలో త్వరలో ఎన్నికలు జరగబోయే అయిదు రాష్ట్రాల్లో రెండుచోట్ల అభ్యర్థుల తొలి జాబితాలను ప్రకటించిన భాజపా.. తెలంగాణలో అలాంటి సాహసం చేయలేకపోతోంది. అన్నిచోట్లా వారికి తగిన అభ్యర్థులు లేరు.. అనేదొక్కటే పాయింట్ కాదు. భారాస, కాంగ్రెస్ టికెట్లు ప్రకటించిన తర్వాత.. తిరస్కృత నాయకులు తమ పార్టీలోకి వచ్చి చేరుతారేమో, వారికి టికెట్లు కట్టబెట్టొచ్చు అనే ఆశ కూడా ఉంది. 

గులాబీ దళపతి కేసీఆర్.. తమ పార్టీ సిటింగు అభ్యర్థులలో కొందరికి టికెట్లు దక్కకపోవచ్చునని ముందే సంకేతాలు ఇచ్చేశారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి భారాసలో చేరిన వారికి టికెట్ గ్యారంటీ పథకాన్ని అప్పట్లో ప్రకటించారు గానీ.. ఇప్పుడు పార్టీ చేయించుకుంటున్న సర్వేల ఆధారంగా వారిలో కూడా కొందరికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. మొత్తం నలుగురైదుగురికి టికెట్లు దక్కవని తొలి నుంచి ప్రచారం ఉంది. తీరా ఇప్పుడు జాబితాలు సిద్ధమైన తరుణంలో సుమారు ఇరవై మందికి టికెట్లు దక్కకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో గులాబీ టికెట్లు దక్కకుండా.. తిరుగుబాటు చేసి ఆ పార్టీ నుంచి ఎవరెవరు బయటకు వస్తారా? అని బిజెపి ఎదురుచూస్తోంది. భారాస నుంచి తిరస్కృతులుగా బయటకు వచ్చేవారిని నెత్తిన పెట్టిన వారికి టికెట్లు ఇచ్చి బరిలోకి దించడానికి ఉత్సాహపడుతోంది. అందుకే తె భాజపా జాబితాలు ఇంకా సిద్ధం కాలేదనే ప్రచారం జరుగుతోంది. 

నిజానికి కాంగ్రెసు పార్టీలో కూడా ముఠా కుమ్ములాటలు ఉన్నాయి. తాజా చేరికల నేపథ్యంలోనూ కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాబితాలు ప్రకటించిన తర్వాత.. ఆ పార్టీనుంచి కూడా కొందరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి వారికోసం బిజెపి ఆశగా ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.