Advertisement

Advertisement


Home > Movies - Movie News

7 వారాలు కాస్తా 50 రోజులైంది.. అయితే ఏంటి?

7 వారాలు కాస్తా 50 రోజులైంది.. అయితే ఏంటి?

వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు.. వాళ్లే తుంగలో తొక్కుతారు. టాలీవుడ్ లో కామన్ ప్రాక్టీస్ ఇది. రూల్స్ పాటించడంలో ఇక్కడో అవ్యవస్థ నడుస్తుంటుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే స్పందనలు వినిపిస్తుంటాయి. ఓ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎప్పుడివ్వాలనే అంశంపై ఇలాంటి కప్పదాటు వ్యవహారాలు చాలానే జరిగాయి. ఇప్పుడు తాజాగా మరోసారి దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

థియేటర్లలో ఓ సినిమా రిలీజైన 7 వారాల వరకు ఓటీటీకి ఇవ్వకూడదనే నిబంధన ఇప్పటిది కాదు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. కానీ ఈ రూల్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు. థియేటర్ లో రిలీజైన వారం రోజులకే తమ సినిమాను ఓటీటీకి ఇచ్చేసిన నిర్మాతలు కూడా ఉన్నారు. పోనీలే పాపం చిన్న నిర్మాతలు, కక్కుర్తి పడ్డారు అనుకుందాం. ఇప్పుడా రూల్స్ బ్రేక్ చేసే వ్యవహారం పెద్ద సినిమాలకూ పాకింది.

మొన్నటికిమొన్న రాధేశ్యామ్ సినిమాను గడువు కంటే ముందు ఓటీటీకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను కూడా ఇలానే ఆదికి ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టేశారు. ఈ విషయంలో పెద్ద-చిన్న తేడా లేదు. థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయిందనిపిస్తే చాలు, కాస్త ఎక్కువ డబ్బులొస్తాయనే ఆశతో ముందుగానే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.

ఇప్పుడీ పద్ధతికి చెక్ పెట్టాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఇకపై ఏ సినిమానైనా విడుదలైన 50 రోజుల్లోపు ఓటీటీకి ఇవ్వకూడదనేది ఆ నిబంధన. అంటే గడువును 49 రోజుల నుంచి ఒక రోజు పెంచారన్నమాట. ఇక్కడ ఎన్ని రోజులు గడువు పెట్టారనేది ముఖ్యం కాదు, ఆ నిబంధనను ఎంతమంది పాటిస్తారనేది చూడాలి.

రేపట్నుంచే కొత్త రూల్

ఈ కొత్త నిబంధన రేపట్నుంచే అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. రేపు పక్కా కమర్షియల్ సినిమాతో పాటు.. మరో 3 చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమాను 50 రోజుల ముందుగా ఓటీటీకి ఇవ్వకూడదు. మరి వీటిలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితేంటి? వచ్చే వారం మరో 3 సినిమాలొస్తున్నాయి. వాటి సంగతేంటి? పెద్ద సినిమాల హడావుడి అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా ఈ నిబంధనను మరోసారి తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేంటి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు పక్కనపెడితే.. ఇకనైనా పెద్ద-చిన్న నిర్మాతలంతా ఈ నిబంధనకు కట్టుబడి ఉంటే ఇండస్ట్రీకి మంచిది. లేదంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు, చేజేతులా థియేట్రికల్ వ్యవస్థను నాశనం చేసుకున్నోళ్లవుతారు. ఇప్పటికే థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. 

అంటే సుందరానికి, విరాటపర్వం లాంటి సినిమాల్ని థియేటర్లలో చూడకుండా ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు చాలామంది. ప్రేక్షకుల్లో ఈ ఫీలింగ్ పోగొట్టాలన్నా, అలాంటి వాళ్లను తిరిగి థియేటర్ల వైపు తీసుకురావాలన్నా ఈ ఓటీటీ నిబంధనను తూచ తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో వివక్షకు తావుండకూడదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?