పవన్ ‘నాగాస్త్రం’.. ఈసారి టార్గెట్ కొడుతుందా?

టీడీపీలో లోకేష్ ను లేపడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసు. అవి ఎప్పటికప్పుడు క‌ళ్ళ‌ ముందు కనిపిస్తున్నాయి కూడా. అయితే దాదాపు ఇలాంటి ప్రయత్నమే సమాంతరంగా మరో పార్టీలో జరుగుతోంది. ఆ…

టీడీపీలో లోకేష్ ను లేపడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసు. అవి ఎప్పటికప్పుడు క‌ళ్ళ‌ ముందు కనిపిస్తున్నాయి కూడా. అయితే దాదాపు ఇలాంటి ప్రయత్నమే సమాంతరంగా మరో పార్టీలో జరుగుతోంది. ఆ పార్టీ పేరు జనసేన, ఆ వ్యక్తి పేరు నాగబాబు.

అవును.. నాగబాబును లేపేందుకు జనసేన విపరీతంగా ప్రయత్నిస్తోంది. ప్రతి కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు పవన్, నాదెండ్లతో పాటు నాగబాబు కూడా ఫ్లెక్సీలకు ఎక్కారు. అంతేకాదు.. మొన్నటివరకు పవన్, నాదెండ్ల పేరిట మాత్రమే ప్రెస్ నోట్లు వచ్చేవి. ఇప్పుడు నాగబాబు పేరిట కూడా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి నాగబాబుకు హైప్ ఇచ్చి, ఏదో ఒక స్థానం నుంచి గెలిపించుకోవాలని తమ్ముడు పవన్ కల్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది.

పోటీ చేస్తే పోయేదేముంది..

సినిమావాళ్లు తమ కుటుంబం వాళ్లను ఎలా హీరోలుగా చేసి జనాలపై రుద్దుతారో అందరికీ తెలిసిందే. పదే పదే అదే హీరోల మొహం చూసీ చూసీ జనం నిజంగానే వారు హీరోలని నమ్మేస్తారు. కానీ అప్పట్లో అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి నాగబాబు సినిమాల్లో రాణించలేకపోయారు. పగలబడీ పడీ నవ్వే జబర్దస్త్ లో మాత్రమే మెప్పించారు. సినిమాల్లో ఫెయిలైన మెగా బ్రదర్ రాజకీయాల్లో అయినా రాణిస్తాడా అంటే అనుమానమే.

అప్పుడు ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన.. అన్నిచోట్లా ప్రగతి శూన్యం. పోటీ చేయడమే తప్ప గెలిచిన దాఖలాలు లేవు. కానీ పోరాడితే పోయేదేముంది అన్నట్టుగా.. పోటీ చేస్తే పోయేదేముంది అన్న రీతిలో నాగబాబుని పదే పదే బరిలో దింపుతున్నారు. అప్పుడు అన్న చిరంజీవి జాకీలు వేస్తే, ఇప్పుడు తమ్ముడు పవన్ కూడా నాగబాబుకి జాకీలు వేసి పైకి లేపుతున్నారు.

కాపు ఓట్లు కావాలంటే తప్పదా..?

జనసేనని కొంతమంది కాపులు బాగా ఓన్ చేసుకున్నారు. అయితే వారికి నాదెండ్ల నాయకత్వం గిట్టడం లేదు. దీంతో సమాంతరంగా నాగబాబుని పైకి లేపుతున్నారు పవన్ కల్యాణ్. నాగబాబుకి కూడా స్టేజ్ పై ప్రయారిటీ ఇవ్వడం, ఆయన ఫ్లెక్సీలు, ఆయన పేరుతో ప్రెస్ నోట్లు, ఆయనతో ప్రెస్ మీట్లు.. ఇలా తన సామాజిక వర్గం వారిని మరింత దగ్గర చేసుకునేందుకు నాగాస్త్రం సంధిస్తున్నారు.

కానీ నాగబాబు కూడా లోకేష్ బాబు లాగానే. సొంత టాలెంట్ లేదు, అలాగని పక్కవారు చెప్పింది కూడా వినరు, ఒప్పుకోరు. జనంలో తిరగలేరు, జనం మెచ్చేలా మాట్లాడలేరు. అక్కడ లోకేష్ తండ్రిని అడ్డుపెట్టుకుంటే, ఇక్కడ నాగబాబు తమ్ముడ్ని అడ్డుపెట్టుకున్నారు.

పవన్ కల్యాణ్ సీజనల్ పొలిటీషియన్ అయితే, నాగబాబు అంతకంటే ఇంకా సీజనల్. ఎన్నికలకు రెండేళ్లే టైమ్ ఉండటంతో.. ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు, ఆయన్ను బాగా పైకి లేపేందుకు పవన్ కూడా ట్రై చేస్తున్నారు. పవన్ కే దిక్కులేదు, ఇక నాగబాబు సంగతేంటని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.