మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలు ఎప్పుడూ జరిగేవే. ఆ ఎన్నికల్లో మెగా కాంపౌండ్ తన ప్రభావం చూపించడం కూడా ప్రతిసారి జరిగేదే. నందమూరి కుటుంబం మాత్రం దీన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఈసారి మాత్రం సీన్ మారింది. త్వరలోనే జరగనున్న 'మా' ఎన్నికల్లో బాలకృష్ణ తలదూర్చాలని భావిస్తున్నారంట.
'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అందరికంటే ముందు బరిలోకి దిగారు. మెగా కాంపౌండ్ ఆశీస్సులు బలంగా ఉన్న వ్యక్తి ఇతడు. సాధారణంగా ఎప్పుడైనా 'మా'లో మెగా ఆశీస్సులు ఉన్న వ్యక్తులే నెగ్గుతూ వచ్చారు. వాళ్ల కోటరీ, వాళ్ల లాబీయింగ్ అలాంటిది. కానీ ఈసారి మాత్రం మెగా వెర్సెస్ నందమూరి అనేలా 'మా' ఫైట్ మారబోతోందంటున్నారు విశ్లేషకులు.
బాలయ్య సోలోగా వస్తే ఫలితం ఉంటుందా..?
పోటీలో తను కూడా ఉన్నట్టు సడెన్ గా ప్రకటించారు జీవిత రాజశేఖర్. ఈమెకు బాలకృష్ణ అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి జీవిత కోసం బాలయ్య తన వంతు ప్రయత్నం చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్య ఒక్కడి వల్ల కాదు. అతడితో పాటు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిస్తేనే జీవితకు ప్లస్. ఆమెకు చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తప్పకుండా దిగాల్సిందే. కానీ బాలయ్య అడగందే ఎన్టీఆర్ ఆ పని చేయడు.
మెగా కాంపౌండ్ లో అందరిదీ ఒకటే మాట. చిరంజీవి ఏది చెబితే అదే ఫైనల్. నందమూరి కాంపౌండ్ లో ఆ పరిస్థితి మొన్నటివరకు లేదు. ఎన్టీఆర్ ను బాలకృష్ణ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈమధ్య పట్టించుకున్నట్టు కనిపించినా, అదంతా అటుఇటు వ్యవహారంలానే కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ను బాలయ్య కలుపుకుంటేనే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుంది. లేదంటే బాలయ్యకు 'మా'లో కష్టమే.
సభ్యుల్లో ఎవరు ఎటు వైపు..?
900కు పైగా సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో దాదాపు 400 మందికి పైగా సభ్యులు మెగా కాంపౌండ్ వైపు ఉన్నారనేది ఇన్ సైడ్ టాక్. ఇన్నాళ్లూ బాలయ్య రంగంలోకి దిగకపోవడం వల్ల కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి వైపు వెళ్లారని అంటారు. ఇప్పుడు బాలయ్య తెరవెనక నుంచి నడిపిస్తున్నారు కాబట్టి, ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు సీనియర్ నటి హేమ కూడా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం ఉంది.
హేమ ఎవరి పేరు చెబితే, వాళ్లకు ఓట్లేసే బ్యాచ్ ఒకటి ఉంది. పైకి 300 అని ఆమె చెబుతున్నప్పటికీ.. హేమ చేతిలో దాదాపు 150 ఓట్ల వరకు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. హేమ ఎవరి పేరు చెబితే, ఆ 150 మంది వాళ్లకే ఓట్లేస్తారు. ఆఖరి నిమిషంలో ఆమె పోటీ నుంచి తప్పుకొని, వేరే వ్యక్తికి మద్దతిచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆమె చిరంజీవి వైపు మొగ్గుచూపుతారా.. బాలయ్య వైపు వస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
నరేష్ హవా తగ్గినట్టేనా..?
ఈ మొత్తం ఎపిసోడ్ లో వీక్ గా కనిపిస్తున్న వర్గం ఏదైనా ఉందంటే అది నరేష్ వర్గం మాత్రమే. జీవిత ఇచ్చిన జర్క్ తో ఇప్పటికే ఆయన తన కోటరీలో సభ్యుల్ని కొంతమందిని కోల్పోయాడు. మహేష్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు లాంటి వ్యక్తుల అండదండలతో అటు బాలయ్యను, ఇటు చిరంజీవిని ఎదుర్కోవడం నరేష్ వల్ల కాకపోవచ్చు. అందుకే ఎన్నడూ లేనిది కొత్తగా ఏకగ్రీవం అనే టాపిక్ ను తెరపైకి తెచ్చారు.
మరోవైపు ఈ వివాదాలకు దూరంగా ఉండేందుకు, కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బాలయ్య, చిరంజీవి ఇద్దర్నీ కోరుకునే కొంతమంది ఈసారి ఓటింగ్ కు దూరంగా జరగబోతున్నారట. ఇది కూడా ఈసారి ఎన్నిక ఫలితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తమ్మీద బాలకృష్ణ, చిరంజీవి పరోక్షంగా దిగబోతున్న ఈ ఎన్నికలు 'మా' చరిత్రలోనే రసవత్తరంగా మారబోతున్నాయి.