లోకేష్ రాజకీయం-నిజమైనా.. కల అయినా నిరాశలో ఒకటేనా!

నిజమైనా, కల అయినా నిరాశలో ఒకటేలే అని ఒక పాట ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల కొందరి పరిస్థితి అలాగే ఉంది. వారిలో ఆ ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిరోజుల క్రితం మాజీ…

నిజమైనా, కల అయినా నిరాశలో ఒకటేలే అని ఒక పాట ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల కొందరి పరిస్థితి అలాగే ఉంది. వారిలో ఆ ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను, విమర్శలను గమనిస్తే ఆ విషయం సుబోధకం అవుతుంది.

లోకేష్ 2014-19 టరమ్‌లో ఏపీలో అత్యంత శక్తివంతుడు కింద లెక్క. తండ్రి చంద్రబాబు అధికారాన్ని పూర్తిగా వాడుకున్న వ్యక్తి. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా, తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల ద్వారా తండ్రిపై ఒత్తిడి తెచ్చి, ఎమ్మెల్సీ అవడమే కాకుండా, ఆ వెంటనే మంత్రి కూడా అవ్వగలిగారని అంటారు.

రాజకీయాలలో ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కాని పెద్దఎత్తున అధికారాన్ని అనుభవించిన తర్వాత, అదిపోతే ఎంత బాధగా ఉంటుందో లోకేష్‌ను చూస్తే అర్థం అవుతుంది. అధికారం ఉన్నప్పుడు కొద్దిగా బొద్దుగా ఉన్నా, నీట్‌గా కనిపించేవారు. మరి ఇప్పుడు స్టైల్ మార్చారో, లేక మరే కారణమో తెలియదు కాని ఆయన గడ్డం పెంచుతున్నారు. కొందరికి గడ్డం బాగానే ఒప్పుతుంది. 

చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు గడ్డంతో కనిపించేవారు కాదు. ఆ తర్వాత వివిధ కారణా ల వల్ల ఆయన గడ్డం పెంచడం చేశారు. అది కూడా నీట్‌గానే కనిపిస్తుంటుంది. బహుశా లోకేష్‌ని గడ్డంతో చూడడానికి మనమంతా అలవాటు పడతామేమో తెలియదు. అయినా అది ఆయన వ్యక్తిగతం కాబట్టి తప్పు పట్టలేం. కాకపోతే ఆ రకంగా కనిపించడం వల్ల ఎక్కువగా నిరాశలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో కోల్పోయినవారికి మల్లే అయన ఉంటున్నారు. నిజానికి ఆయన పోగొట్టుకున్నది పెద్దగా లేదనే చెప్పాలి.

ఆ మాటకు వస్తే ఆయన తండ్రి చంద్రబాబు నాయుడే ఎక్కువ నష్టపోయారని అనుకోవాలి. ఎందుకంటే ఆయనకు వయసు పైబడుతున్న తరుణంలో ఓటమికి గురి అయ్యారు. తక్షణ భవిష్యత్తులో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం లేదు. ఒకవేళ ఆ అవకాశం వస్తే లోకేష్‌కు ఆ పదవి ఇవ్వాలన్న ఒత్తిడి రావచ్చు. వీరిద్దరి సమస్య ఎలా ఉన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రజలలో బలంగా తన ప్రభావం చూపుతున్నారు. కనుక తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో అయినా గెలుస్తుందన్న నమ్మకం కలగడం లేదు.

అందువల్ల చంద్రబాబు కోల్పోయిందే ఎక్కువని వేరే చెప్పనవసరం లేదు. లోకేష్ యువకుడు. రాజకీయంగా ఎంతో ఎదగడానికి అవకాశం ఉన్న వ్యక్తి. కాని అతను కూడా తన తండ్రి బాటలో నడుస్తూ, రాజకీయంగా దెబ్బతింటున్నారేమోనని పిస్తుంది. వెనుకటికి ఏదో సామెత ఉంది. తన తండ్రిని మెరుగు అనిపించేలా కొడుకు ప్రవర్తిస్తున్నాడన్నది ఆ సామెత అర్థం.

ఇప్పుడు సరిగ్గా లోకేష్ అలానే చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ మధ్య కర్నూలు జిల్లాలో జరిగిన ఇద్దరి హత్య ఘటనకు సంబంధించి ఆయన అక్కడకు వెళ్లారు. తప్పు లేదు. వారిద్దరూ తెలుగుదేశం సానుభూతి పరులు అవడం వల్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చు. కాని ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా అసంబద్దంగా ఉన్నాయి.

ఆయన ఉపన్యాసం అంతా విశ్లేషించనవసరం లేదు. రెండు, మూడు వ్యాఖ్యలు చూద్దాం. నేను సింహం వంటివాడిని.. వేటాడుతా అని లోకేష్ అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం. ఎవరిని వేటాడుతారు? ఆ గ్రామంలో హత్యకు గురైన వారి ప్రత్యర్దులను ఈయన వేటాడుతారా? అది ఏ రకంగా కుదురుతుంది? చట్టం ప్రకారం వ్యవహరించవలసిన ఆయన అలా మాట్లాడవచ్చా? మరో మాట చెప్పారు. తాను అన్ని గుర్తు పెట్టుకుంటానని, వ్యక్తిగతంగా తానే వడ్డీతో సహా బదులు తీర్చుకుంటానని ఆయన అన్నారు. అంటే ఇద్దరి హత్యకు ప్రతిగా నలుగురిని హత్య చేస్తామని ఆయన పరోక్షంగా చెబుతున్నారా? లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారా? లేక తెలియక అయోమయంతో మాట్లాడుతున్నారా?

మరి అదే సమయంలో బందరు వద్ద జరిగిన హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్టు అయితే అది అవి అక్రమ అరెస్టులు అని అంటారు. దీనికి ప్రామాణికత ఏమిటో తెలియదు. చంద్రబాబు నాయుడు కూడా గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇలాంటి మాటలు చాలానే మాట్లాడారు. 

ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి నానా మాటలు అంటున్నారు. సైకోఅని, ఉన్మాది అని, రాజారెడ్డి రాజ్యాంగం అని ఇలా ఒకటేమిటి.. రకరకాలుగా అర్థం పర్దం లేని విమర్శలు చేస్తున్నారు. వ్యక్తుల కారెక్టర్‌పై దాడి చేస్తుంటారు. లోకేష్ కూడా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఒక అడుగు ముందుకు వేసి ఇలా మాట్లాడుతున్నారు. అంతేకాక ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా విమర్శలకు గురైంది. దానిపై వైసిపి నేతలు మరింత తీవ్రంగా రెచ్చిపోయి మాట్లాడారు.

కొందరు మంత్రులు లోకేష్‌కు సమాధానం చెప్పడానికి గాను పరుషబాష వాడారు. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంకా తీవ్రంగా విమర్శించారు అనేకన్నా దూషించారని చెప్పడం కరెక్టుగా ఉంటుందని అనుకోవాలి. వీరు మాట్లాడింది రైట్ అని అనజాలం. కాని లోకేష్ ఇలా రెచ్చగొట్టి, తద్వారా తనను తిట్టించుకోవడం లాభం అనుకుంటున్నారో ఏమో తెలియదు. 

కాకపోతే తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే కొన్ని చానళ్లు మాత్రం లోకేష్ దూషించిన విషయాన్ని పక్కనబెట్టి, వైసీపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లు లోకేష్‌ను తిడుతున్నారని ప్రచారం చేసి సానుభూతి తేవడానికి యత్నించాయి. అయితే వాస్తవం ఏమిటో ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా కూడా కొంతవరకు తెలిసిపోతుంది. లోకేష్ వాడిన భాషతో కూడిన వీడియోలు సర్కులేషన్‌లోకి వచ్చాయి. వెంటనే దానికి వైసీపీ నేతలు ఇచ్చిన సమాధానాలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆయన సింహం అంటే, కాదు అని గ్రామ సింహం అని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు.

అంతేకాదు. లోకేష్‌కు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వ్యక్తిగత ఫోటోల విషయం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. వాటన్నిటిని వివరించడం ఇష్టం లేక ఆ విషయాలను సవిస్తరంగా నేను చెప్పడం లేదు. ఒక చావు ఘటన దగ్గరకు వెళ్లి తాను సింహం వంటివాడినని ఎవరైనా చెప్పుకుంటారా? వడ్డీతో సహా బదులు తీర్చుకుందామని అంటారా? నిజమే మరణించిన వారి కుటుంబాలకు కోపం ఉంటుంది. వారిలో కక్ష ఉంటుంది. 

చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుందాం అని చెప్పి రావల్సిన నేతలు మరింతగా రెచ్చగొడితే కక్షలు మరింతగా పెంచడమే అవుతుందన్న సంగతిని వీరు గ్రహించాలి. ఆ తర్వాత రోజు అనంతపురం జిల్లాలో మరో రెండు హత్యలు జరిగాయి. అక్కడ చనిపోయినవారు వైసీపీ ఎమ్మెల్యేకి దగ్గరవారు. మరి అక్కడ టిడిపివారు హత్యలు చేయించారని వారు ప్రచారం చేయలేదు. ఎందుకంటే భూ తగాదాలో, ఇతర కక్షల కారణంగా అవి జరిగాయని భావించారు. అలాగే కర్నూలు జిల్లాలో కూడా పాత కక్షల కారణంగా జంట హత్యలు జరిగాయని అంటున్నారు.

ఏ హత్య అయినా ఖండించవలసిందే. రాజకీయ హత్యలైతే ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు. కాని వారు తెలుగుదేశంకు పనిచేశారు కాబట్టి రాజకీయ హత్యలుగా ప్రచారం చేసి లబ్దిపొందాలని చూడడం దారుణంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయాలలో చక్రం తిప్పడం ఆరంభం అయిన తర్వాత ఈ దోరణి బాగా పెరిగిందన్నది వాస్తవం. నిజంగా రాజకీయ హత్యలు అయితే ఆ తరహా రాజకీయ విమర్శలు చేయవచ్చు. 

ఎదుటి పార్టీపై ఆరోపణ చేయవచ్చు. చంద్రబాబు కూడా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఆరోపణలు చేయడం, ఆయన దీనిని ఖండించడమే కాకుండా ప్రతి సవాల్ చేయడం జరిగాయి. చంద్రబాబు కన్నా ఒక అడుగు ఎక్కువ వేయడం ద్వారా తన నాయకత్వాన్ని పెంచుకోవాలని తాపత్రయంలో ఉన్న లోకేష్ దూషణలకు దిగి, తాను కూడా దూషణల పాలయ్యారు. సరే! అదే రాజకీయం అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. 

యువకుడిగా ఉన్నప్పుడు నిర్మాణాత్మక రాజకీయాలకు అలవాటు పడి ప్రభుత్వ విధానాలపై అవసరమైన మేర విమర్శలు చేయడం, పార్టీని నిర్మించుకోవడం, పార్టీకి కొన్ని విధానాలు తయారు చేసుకోవడం, మేధోపరమైన చర్చల ద్వారా తన జ్ఞానాన్ని పెంచుకోవడం వంటివి చేస్తే రాజకీయంగా ఎదుగుతారు తప్ప, తన తండ్రి చంద్రబాబు మాదిరి అదష్టం కొద్దో, గాలివాటుగానో ,లేక ఆ తర్వాత అవకాశవాదంతోనో రాజకీయం చేసి పెరిగిపోవాలనుకుంటే అది ఈ రోజుల్లో సాధ్యం అవుతుందా అన్నది సందేహమే. దానికి లోకేష్ ఓటమే ఒక ఉదాహరణ.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మొదట తన తండ్రి రాజశేఖరరెడ్డి ఆసరాతో రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాత ఆయన సొంతంగా కష్టపడి పైకి వచ్చారు. తనకంటూ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. తండ్రి కన్నా గొప్పగా చేస్తున్నాడని ప్రజలు అనుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. 

నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జగన్ కూడా ఒక మాటను తొందరపడి అంటే ఇదే తెలుగుదేశం నేతలు ఆయనపై ఎన్ని విమర్శలు చేశారో గుర్తులేదా? ఆ తర్వాత జగన్ ఎక్కడా తొందరపడకుండా, ప్రత్యర్థులను, ముఖ్యంగా చంద్రబాబు వంటివారిని ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్తపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు చెప్పే విషయాలలోని అబద్ధాలను ఎండగడుతుంటారు. 

అసత్యాలు చెప్పడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి అని, అవకాశవాద రాజకీయాలు చేయడంలో చంద్రబాబు మొనగాడని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. అది అన్ని వేళలా కలిసిరాదని 2019 ఎన్నికలలో ఓటమి అనుభవం తెలియచెబుతుంది. ఆ విషయాన్ని గమనించుకుని లోకేష్ జాగ్రత్తగా ఉంటే మంచిది. దానితోపాటు శుద్ధమైన భాషను, ప్రసంగాల రీతిని మెరుగుపరచుకుంటే భవిష్యత్తులో ఏమైనా జగన్‌కు పోటీ ఇవ్వగలుగుతారు. లేకుంటే అంతా భ్రాంతీయేనా అన్న చందంగా లోకేష్ రాజకీయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు