తెలంగాణ కాంగ్రెస్ సారథిగా ఎంపికైన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీ రెండింటినీ ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యం ఇదిగో అంటూ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ప్రయాణాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ని ఒంటరిగా ఎదుర్కోలేక, బీజేపీతో లాలూచీ పడేందుకే కేసీఆర్, ఈటలను ఆ పార్టీలోకి కావాలనే పంపించారని ఆరోపించారు.
ఈటల బీజేపీ చేరిక సమయంలో మంతనాలు నడిపేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం సమకూర్చింది కేసీఆరేనని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
“కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఓ ఫామ్ హౌజ్ లో చర్చించారు. ఆ చర్చల కోసం, ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కిషన్ రెడ్డి వచ్చిన ఫ్లయిట్ ఎవ్వరిది? ఆ ఫ్లయిట్ ఏర్పాటుచేసింది కేసీఆర్ కాదా? ఈటల ను బీజేపీలో చేర్చడానికి, బీజేపీ సహాయాన్ని కేసీఆర్ తీసుకున్నారు.
ఆ రోజు రాత్రి కిషన్ రెడ్డిని ఎక్కించుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రత్యేక విమానం తెలంగాణకు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తది. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్ల రూపాయల పనులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన విమానం అది. కిషన్ రెడ్డి గారు వచ్చిన ఫ్లయిట్ ఎవ్వరిది..? ఆ ఫ్లయిట్ యజమానికి, కేసీఆర్ కు ఉన్న సంబంధం ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉంది.”
రేవంత్ వ్యాఖ్యలతో కలకలం..
టీఆర్ఎస్, బీజేపీని ఒకే గాటన కట్టేస్తూ, ఈటల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ ఇస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అసలు ఈటల ఎపిసోడ్ లో ఈ ప్రత్యేక విమానం వ్యవహారం ఎందుకొచ్చింది. కేసీఆర్ సన్నిహితుడు కిషన్ రెడ్డికి ఎందుకు సాయం చేశారని ఆరా తీస్తున్నారు.
మొత్తమ్మీద బీజేపీ, టీఆర్ఎస్ రెండూ లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ మాత్రమే వాటికి ప్రత్యామ్నాయమని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. తెరవెనక బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేనని.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు దెబ్బ తగలకుండా ఉండడం కోసమే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
కేసీఆర్ పై పోరు ఉధృతం..
రెండున్నరేళ్లు అధికారంలో ఉండే టీఆర్ఎస్ పై ఇప్పటినుంచే తమ పోరు ఉధృతం చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలను ప్రముఖంగా తెరపైకి తెచ్చి పోరుబాట సాగిస్తామని హెచ్చరించారు. దళితులు, మైనార్టీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీరుస్తామని, టీఆర్ఎస్ ని గద్దె దించుతామని చెప్పారు.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసుల్ని న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004నుంచి 2014 వరకు ఏపీలో సుభిక్ష పాలన అందించిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని దివాళా తెలంగాణగా మార్చిన కేసీఆర్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని చెప్పారాయన.