సెప్టెంబర్‌లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్లో సెగలు రాజేస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష బరి నాలుగు స్తంభాలాటను తలపిస్తోంది. టాలీవుడ్లో నెలకున్న మనస్పర్థలు, భిన్నాభిప్రాయాలు ఈ ఎన్నికల పుణ్యమా అని ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. టాలీవుడ్లో అసలేం జరుగుతున్నదో ‘మా’ ఎన్నికలు బయట పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష బరిలో నిలుస్తున్న ప్రముఖ నటి జీవిత తన మనో వేదనను, ఆలోచనలను పంచుకున్నారు. ఆ అభిప్రాయాలేంటో తెలుసుకుందాం.
ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్ష రేస్‌లో ఉన్న మంచు విష్ణు, హేమ, జీవితా రాజశేఖర్ ప్యానళ్లపై అందరి దృష్టి పడింది. వారి ప్యానళ్లలో ఎవరెవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. తన ప్యానల్‌పై జీవిత స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి ప్యానల్‌ను తయారు చేయనని తేల్చి చెప్పారు. ఒక వేళ పోటీ చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానన్నారు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
900 మంది సభ్యులున్న అసోసియేషన్ ఎన్నికలు రచ్చకు దారి తీయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సమస్య ఇగోలే వల్లే అని ఆమె అభిప్రాయపడ్డారు. అందరూ కలిసి కూర్చుని చర్చించు కొని.. ఏకాభిప్రాయంతో పనిచేస్తే పనులు జరుగుతాయన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే పనులు ఆలస్యమవుతాయని ఆమె తెలిపారు.
గత ఏడాది తాము ఎన్నికైనప్పుడు తమకు ‘మా’ కొత్త అని తెలిపారు. ఎలాంటి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాముల్లో పాల్గొనలేదన్నారు. అప్పుడు జరిగిన విషయాలు తమకు తెలియవన్నారు. ఆ తర్వాత వచ్చిన సమస్యలను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకుందా మని ప్రతిపాదించినట్టు జీవిత చెప్పారు.
తన భర్త రాజశేఖర్ విషయంలో సమస్య ఏర్పడి.. ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో కూడా అందరూ కూర్చుని మాట్లాడుకుందామని ప్రతిపాదించినట్టు తెలిపారు. దాని మీద కూడా ఏకాభిప్రాయం రాలేదన్నారు. ఆ విషయంలో తాను హర్ట్ అయ్యినట్టు జీవిత ఆవేదనతో చెప్పుకొచ్చారు.
ఆ బాధ తనకు ఇప్పటికీ ఉందని జీవిత చెప్పడం గమనార్హం. నిజానికి ఆ తర్వాత తాను ఆఫీస్ బేరర్‌గా కొనసాగడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. కానీ తన భర్త రాజశేఖర్ సర్ది చెప్పడంతో కొనసాగుతున్నట్టు తెలిపారు.
ఇక ప్రస్తుతానికి వస్తే ప్రకాశ్ రాజ్, హేమ తాము అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్నట్టు తనకు చెప్పలేదన్నారు. మోహన్‌బాబు మాత్రం మాట్లాడారాని తెలిపారు. తమ అసోసియేషన్‌లో దాదాపు 350 మంది మహిళా సభ్యులున్నారని తెలిపారు. ఇప్పటి దాకా ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదన్నారు. గతంలో పెద్దలందరూ ఒక మహిళ అధ్యక్షురాలు కావాలని ఆకాంక్షించారన్నారు. ఆ రోజు కూడా రావాలని ఆమె అన్నారు.