తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి నియామకం కాంగ్రెస్‌లో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఇకపై తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌కు దబిడి దబిడే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దూకుడు స్వభావం గల నేత. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అని తలపడే నేతగా గుర్తింపు పొందారు. కేసీఅర్‌ను ఎదుర్కో వాలంటే దూకుడున్న నేతలే కావాలనే అభిప్రాయాలు తెలంగాణ సమాజంలో బలంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా అనేక కసరత్తులు చేసి, చాలా మంది అభిప్రాయాలు తీసుకుని చివరికి రేవంత్ రెడ్డిని నియమించడం విశేషం. తెలంగాణలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డిని నియమించడం సరైన నిర్ణయంగా భావించొచ్చు.
కేసీఆర్ ఒక్క మాటంటే వంద మాటలు మాట్లాడే నేర్పరితనం రేవంత్‌రెడ్డి సొంతం. తెలంగాణలో రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే తక్కువ సమయంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వైనం ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని ప్రతిబింబిస్తుంది.
2006లో మిడ్జిల్ జడ్పీటీసీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. 2007-09లో వైఎస్సార్ హయాంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయంగా ఉజ్వల భవిష్యత్ ఉన్న నేతగా దివంగత వైఎస్సార్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2009, 2014లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ముఖ్యంగా కేసీ ఆర్‌కు కంట్లో నలుసుగా మారాడు. ఎలాగైనా రేవంత్‌ను కంట్రోల్ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇరుక్కున్నారు.
అనంతర రాజకీయ సమీకరణల్లో 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమిపాల య్యారు. అయినప్పటికీ రాహుల్‌గాంధీ ఆశీస్సులతో 2019లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీగా 2019లో గెలుపొంది తనకు ప్రజల్లో తిరుగులేదని చాటి చెప్పారు.
రాజకీయంగా ఓటుకు నోటు కేసు రేవంత్‌పై మాయని మచ్చ అని చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ చంద్రబాబు మనిషి అనే ముద్ర ఇప్పటికీ ఉంది. ఇలాంటివి అననుకూల అంశాలు ఎన్ని ఉన్నా రేవంత్‌రెడ్డి మాత్రం పోరాట పటిమ గల నేతగా ప్రజలు గుర్తించారు.
తెలంగాణలో దాదాపు కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని భావిస్తున్న తరుణంలో రేవంత్‌రెడ్డి నియామకం, ఆ పార్టీకి ఎంత వరకూ ప్రాణం పోస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించారు ధనిక రాష్ట్రాన్ని.. దివాళా తెలంగాణగా మార్చిన కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. ఆయన అరాచకాలు.. కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులపై పోరాటం చేస్తామన్నారు.
2004 నుంచి 2014 వరకు పదేళ్లు సుభిక్ష, సమర్థ పాలనను కాంగ్రెస్ పార్టీ అందించిందన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని, తెలుగు ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపించిందన్నారు. ఆ పూర్వ వైభవం తీసుకురావడానికి తనకు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారన్నారు. రాహుల్‌గాంధీ నమ్మకాన్ని, సోనియాగాంధీ విశ్వాసాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నేరవేర్చేలా తన ప్రయత్నం ఉంటుందన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని, ఈటల రాజేందర్‌ను భాజపాలోకి పంపించిందే కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గట్టి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ రథసారథులైన రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మాటల తూటాలతో ఆ రాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరుగుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇకపై కథ మరోలా ఉంటుందని చెప్పొచ్చు.