కరోనా కోవిడ్-19 వైరస్ కు సంబంధించి ఇప్పుడు అంతుబట్టని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటి వరకూ కోవిడ్-19 రెండు వేవ్స్ లో ఇండియాలో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఫస్ట్ వేవ్ కు మించి ప్రమాదకరంగా సెకెండ్ వేవ్ లో విషాదాన్ని మిగిల్చి వెళ్లింది కోవిడ్-19 వైరస్. ప్రస్తుతం రోజువారీ కేసులు 50 వేల స్థాయిలో ఉన్నాయి.
గమనించాల్సిన అంశం ఏమిటంటే..సెకెండ్ వేవ్ అంత ఈజీగా తగ్గిపోవడం కూడా లేదు. ఇప్పటికే తగ్గుదల నమోదు కావడం మొదలై నెలన్నర గడిచింది. అయితే.. ఇంకా రోజుకు 50 వేల స్థాయిలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో అవరోహన క్రమంలో కూడా సెకెండ్ వేవ్ వేగంగా తగ్గడం లేదని స్పష్టం అవుతూ ఉంది.
శని, ఆది వారాలకు సంబంధించి వెల్లడవుతున్న డేటాలో కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. వారంలో ఆ తర్వాతి రోజుల డేటాలో నంబర్లు కాస్త పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి 50 వేల స్థాయి కన్నా రోజు వారీ కేసుల సంఖ్య తగ్గి, మళ్లీ పెరుగుదల నమోదైంది. అయితే కరోనా వైరస్ గురించి పరిశోధిస్తున్న వైరాలజిస్టులు మాత్రం సెకెండ్ వేవ్ త్వరలోనే పూర్తిగా తగ్గిపోతుందని అంచనా వేశారు.
జూన్ నెలాఖరుకు కేసుల సంఖ్య బాగా తగ్గవచ్చనేది వారు ఇది వరకూ వేసిన అంచనా. అయితే రోజుకు 50 వేల స్థాయిలో ఇంకా కేసులు వస్తున్నాయి. బాగా తగ్గడం అంటే ఇది కాదేమో! ఎంతో కొంత తగ్గుతున్నాయని అనుకున్నా.. ఇకపై పరిస్థితి ఎలా ఉంటుంది? అనేది ఇంకా స్పష్టత లేని ప్రశ్నగానే మిగిలింది. కోవిడ్ వైరస్ ఇప్పటికే మరో వేరియెంట్ లోకి మారిందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.
డెల్టా ప్లస్ వేరియెంట్ లోకి కరోనా వైరస్ మారిందని, ఇది మరింత వేగం వ్యాపిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఆవిష్కృతం అయిన వ్యాక్సిన్లు కూడా ఈ కొత్త వైరస్ రకంపై ప్రభావం చూపిస్తాయా అనేది సందేహాలు నెలకొన్నాయి. వాస్తవానికి సెకెండ్ వేవ్ కు ముందే వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కూడా ఆ వేవ్ లో కరోనా సోకింది.
ఒక డోసు వేసుకున్న అనేక మందికి సెకెండ్ వేవ్ లో కరోనా సోకింది. రెండో డోసు వేసుకున్న వారికి కూడా కరోనా సోకింది. అయితే వారు తేలికగానే బయటపడ్డారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నా, ప్రజల్లో అయితే అనుమానాలున్నాయి. వ్యాక్సిన్లు ఎంత వరకూ కరోనా నుంచి రక్షించగలవో ఇప్పుడప్పుడే క్లారిటీ రాదు. రాబోయే ఆరు నెలల్లో ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.
అయితే ఇండియాకు ఊరటను ఇచ్చే విషయాలను కూడా కొన్నింటిని చెబుతున్నారు పరిశోధకులు. కొంతమంది వైరాలజిస్టులు స్పందిస్తూ.. కోవిడ్-19 వైరస్ ఇకపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలను కొట్టి వేస్తున్నారు. వైరస్ ఇక కొత్త రూపాలను సంతరించుకుని తీవ్ర ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని వారు అంటున్నారు.
తన మనుగడ కోసం వైరస్ తన రూపాన్ని మార్చుకోవచ్చు గాక, అయితే అది కచ్చితంగా మనిషి మనుగడకు ప్రమాదం కావాలనే రూలేమీ లేదని మాత్రం వారు అంటున్నారు. ఏతావాతా కరోనాకు ఇప్పటికే క్లైమాక్స్ వచ్చేసిందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇంకవైపు ఇప్పటికే డెల్టా ప్లస్ అంటుకుంటోందని, రెండు నెలల్లోనే మూడో వేవ్ అని, కాదు అక్టోబర్-నవంబర్ లో మూడో వేవ్ అని మరి కొందరు పరిశోధకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎవరి అంచనాలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివిలా ఉన్నాయి. ఎవరికి వారు రకరకాల ఆధారాలను, ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఉన్నారు. దాదాపు అందరికీ అంచనాలే.
భవిష్యత్తును చూసి వచ్చిన వారు కానీ, కరోనా వైరస్ తీరు వంద శాతం తెలిసిన వారు కానీ ఎవరూ లేరు! ఏతావాతా.. కరోనా విషయంలో ఇప్పటి వరకూ చూసింది ట్రైలర్ పార్ట్ మాత్రమేనా, లేక క్లైమాక్స్ అయిపోయిందా.. అనేది ప్రస్తుతానికి స్పష్టత లేని అంశమే. రాబోయే ఐదారు నెలల్లోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు వ్యాక్సినేషన్ ఊపందుకుంటూ ఉండటం ఊరటను ఇచ్చే అంశం. పని చేస్తుందా, వ్యాక్సిన్ ప్రభావం ఎంత, కరోనా కొత్త రూపాలపై వ్యాక్సిన్ ఉపయోగం ఉంటుందా.. అనే ప్రశ్నలకు సామాన్యులకు కళ్లు తెరిపించే సమాధానాలు ఎవ్వరూ ఇవ్వలేరు. అయితే వ్యాక్సిన్ వల్ల చెడు అయితే ఉండదని ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఎంతో కొంత మంచే తప్ప.. నష్టం మాత్రం జరగదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. కాబట్టి.. వ్యాక్సిన్ వేయించుకుని, కాన్ఫిడెన్స్ ను పెంచుకోవడం, మాస్కులు- శానిటైజర్ల వినియోగాన్ని తప్పనిసరిగా చేసుకోవడమే ప్రస్తుతానికి చేయగలిగింది!