తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయి నేతలున్నారు రాయలసీమ నుంచి! ఆ పార్టీ ని అతిగా ఓన్ చేసుకునే సామాజికవర్గం నేతలు అయితే పార్టీ అధికారంలో ఉన్నదంతా తమ వల్లనే అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉంటారు! మంత్రి పదవులు వాళ్లకే, వాళ్ల జనాభా లేని చోట కూడా ఎమ్మెల్యే పదవులు వాళ్లకే! అధికారంలో ఉన్నప్పుడు వీళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. ప్రాంతానికి, పార్టీకి కూడా తామే పెద్దలం అన్నట్టుగా రచ్చ చేస్తూ ఉంటారు.
అలాంటి వారు అధికారం కోల్పోయి రెండేళ్లు గడిచిపోయాయి. మరి ఇప్పటి వరకూ వారి ఉనికి మళ్లీ జనం మధ్యన కనపడకపోవడం గమనార్హం. రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ నాలుగు జిల్లాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మూడు సీట్లలో మాత్రమే నెగ్గింది. అయినప్పటికీ.. సంప్రదాయ ఓటు బ్యాంకు మాత్రం టీడీపీ చెంతనే ఉంది. తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నికతో కూడా అదే రుజువయ్యింది. టీడీపీకి దశాబ్దాల నాటి ఓటు బ్యాంకు అలాగే ఉండొచ్చు గాక, ఆ మాత్రం ఓట్లతో విజయం అయితే దక్కదని స్పష్టం అవుతోంది.
టీడీపీ గెలవాలంటే ఎన్నో కారణాలుండాలి. అధికారంలో ఉన్న వారిపై వ్యతిరేకత ఉండాలి, ఆపై టీడీపీకి బీజేపీ, జనసేన వంటి పార్టీలతో పొత్తులుండాలి. లోపాయికారి ఒప్పంందాలుండాలి. టీడీపీతో పొత్తు పెట్టుకునే జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ఊపుండాలి! అలాంటివన్నీ కలిసివస్తేనే టీడీపీకి అధికారం దక్కుతుంది. సోలోగా సత్తా చాటే పార్టీ కాదు టీడీపీ.
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి తోడు బీజేపీ, జనసేన వంటి ఏ మేరకు కలిసి వస్తాయో ఇప్పుడే అంచనా వేయలేం కానీ, ఇప్పుడు అసలు కథ టీడీపీ తన బేస్ ను కోల్పోతూ ఉండటమే. క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ బాగా దూరం అయిపోయింది. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేస్తారు తప్ప, అధికారం లేకపోతే వారి అడ్రస్ లను పట్టుకోవడం కూడా కష్టం అనే విషయం రుజువవుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహారం ఇలా ఉండేది కాదు. ఎన్నికలు అయిపోయిన రెండు మూడు నెలల్లోనే జగన్ జనం మధ్యకు వెళ్లిపోయారు. ఎన్నికలయ్యాకా వచ్చిన తొలి సంక్రాంతి సమయానికే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ చార్జిలు క్యాడర్ తో కలుపుకుని పోవడం మొదలైంది. ఆ తర్వాత నాలుగున్నరేళ్లూ ఏకబిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరిగాయి.
అన్నింటికి మించి ప్రతిపక్ష పార్టీ ప్రజలకు టచ్లో ఉంటూ వచ్చింది. దాని ద్వారా వ్యవస్థ చేత బాధింపబడే వారికి ఉపయోగం ఉండనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండటం కూడా కీలకమైన అంశం అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో పెద్ద పెద్ద నేతలున్న ప్రాంతంలోనే ప్రతిపక్షం ఊసులో లేదు. గత ఎన్నికల్లో కంచుకోటలే బద్ధలు కాగా.. ఆ కంచుకోటల్లోని నేతలు ఇప్పుడు తమ ఇంటి కోటల్లో దాక్కున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు నాయుడును అనుసరిస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు నాయుడు ఏడాదిగా హైదరాబాద్ కు పరిమితం అయ్యారు. గతంలో జగన్ జనం మధ్యన ఉంటే ఆయన హైదరాబాద్ లో ఉన్నాడంటూ తెలుగుదేశం నేతలు విమర్శలు చేసే వాళ్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే అక్కడ మకాం పెట్టగా.. టీడీపీ కిక్కురుమనే పరిస్థితిలో లేదు.
చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగులతో అయినా పచ్చ మీడియాలో తన ఉనికిని చాటుకుంటున్నారు. దాని వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం వీసవెత్తు కూడా ఉండదు. టీడీపీ కార్యకర్తలు కూడా ఆ తీరుతో విసిగెత్తిపోయి ఉంటారు. చంద్రబాబు నాయుడు తీరు అలా ఉంటే.. నియోజకవర్గాల ఇన్ చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ల మొహాలను కూడా ప్రజలు మరిచిపోయే పరిస్థితి వచ్చింది.
కరోనాను కారణంగా చూపుతున్నా.. తెలుగుదేశం నేతలకు ఆకలి తీరిపోయిందని మాత్రం స్పష్టం అవుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉండిన 2014-19 మధ్యన సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో మొదలుపెడితే జన్మభూమి కమిటీ సభ్యుల వరకూ తలా కొంత పంచుకున్నారు. ఎవ్వరూ ఖాళీ జేబులతో వెళ్లలేదు.
అందరి జేబులూ నిండిన పరిస్థితి అప్పటిది. జీవితానికి, తరతరాలకూ కావాల్సినంత స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు అప్పట్లోనే సంపాదించేశారు. ఇప్పుడు వారు దాన్ని ఆస్వాదిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మళ్లీ జనం మధ్యకు వచ్చి ఊరికే డిస్ట్రబ్ కావడం, అధికారంలో ఉన్న వారి కంట్లో పడటం వల్ల వచ్చే ప్రయోజనం లేదని సీమలోని టీడీపీ నేతలు బాగా గ్రహించినట్టుగా ఉన్నారు.
అందుకే ఒక్కరంటే ఒక్కరు కూడా గూడు విడవడం లేదు. మరి ఆకలి తీరిపోయిన ఈ నేతలతో చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం దిశగా వెళ్లగలరా? అనేదే అసలు సిసలు ప్రశ్న!