సూపర్ స్టార్ బలవంతపు రిటైర్ మెంట్?

కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ఎంత ముఖ్యమో.. అదే కెరీర్ నుంచి సరైన సమయంలో రిటైర్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించక…

కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ఎంత ముఖ్యమో.. అదే కెరీర్ నుంచి సరైన సమయంలో రిటైర్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించక అలా విమర్శలు ఎదుర్కొన్న క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడిదే సూత్రం రజనీకాంత్ కు కూడా వర్తిస్తుంది. తనకు మార్కెట్ ఉంది కాబట్టి, అభిమానులు చూస్తున్నారు కాబట్టి రజనీకాంత్ సినిమాలు చేస్తున్నారు. కానీ ఎన్నాళ్లు..? ఆయన రిటైర్ మెంట్ తీసుకునే టైమ్ వచ్చేసింది.

కోలీవుడ్ లో రజనీకాంత్ కు అతిపెద్ద మార్కెట్ ఉంది. ఆ మాటకొస్తే బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ కు మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను చెడగొట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు రజనీకాంత్. తెలుగులో ఆయన సినిమాలు చూసే జనాలు తగ్గినప్పటికీ, తమిళనాట మాత్రం తళైవ ఫ్యాన్స్ అతడి సినిమాలు చూస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ గా సినిమాలు చేసే పరిస్థితిలో రజనీకాంత్ లేరు.

రజనీకాంత్ ఆరోగ్యం మునుపటిలా లేదు. వయసురీత్యా వచ్చిన సమస్యల వల్ల ఆయన ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. అన్నాత్తై సినిమాలో మరోసారి అనారోగ్యానికి గురైన రజనీకాంత్… రీసెంట్ గా మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. చిన్నపాటి సర్జరీతో బయటపడ్డారు. దీంతో ఆయన తదుపరి సినిమాలపై అనుమానాలు మొదలయ్యాయి.

70 ఏళ్ల రజనీకాంత్ అన్నాత్తై (పెద్దన్న)తో కలిపి 168 సినిమాలు పూర్తిచేశారు. ఆయన 170 సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కు కూడా ఉంది. అందుకు తగ్గట్టే పెరియసామి, కార్తీక్ సుబ్బరాజు లాంటి దర్శకులతో కథాచర్చలు జరిపారు సూపర్ స్టార్. కానీ వయోభారంతో ఆ 2 సినిమాల్ని ఆయన పూర్తిచేయగలరా అనేది అందరి డౌట్. తప్పనిసరి పరిస్థితుల మధ్య రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు, సినిమాల నుంచి కూడా అదే విధంగా తప్పుకుంటే, సూపర్ స్టార్ సినీ కెరీర్ కు అది సరైన క్లైమాక్స్ అనిపించుకోదు.

మరికొందరు మాత్రం రజనీకాంత్ హుందాగా సినిమాల నుంచి తప్పుకునే సమయం వచ్చేసిందంటున్నారు. ఇలా క్రేజ్, భారీ మార్కెట్ ఉన్నప్పుడే సినిమాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే, రియల్ సూపర్ స్టార్ అనిపించుకుంటారని అంటున్నారు. మరి రజనీకాంత్ పెద్దన్నతోనే తన సినీప్రస్థానాన్ని ఆపేస్తారా? లేక ఫ్యాన్స్ కోరిక మేరకు 170 మైలురాయిని అందుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ స్టయిల్ లోనే చెప్పాలంటే.. దేవుడు శాసిస్తే, రజనీ పాటిస్తారు.. 170 సినిమాలు పూర్తిచేస్తారు.