బద్వేల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారా? అంటే ఔనని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పవన్‌కల్యాణ్ రాజకీయ అవగాహన రాహిత్యం, అనుభవలేమికి బద్వేల్ ఉప ఎన్నికలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఉదహరిస్తున్నారు.
బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేసి వుంటే… ఆ ఓట్లన్నీ తన ఖాతాలో వేసుకుని వుండే అవకాశాన్ని చేజేతులా జారి విడుచుకున్నారని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకటసుబ్బయ్య గెలుపొందారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పలేదు. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆయన లేదా ఆమె కుటుంబ సభ్యులు బరిలో వుంటే అక్కడ పోటీ చేయకూడదనే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకున్నట్టు జనసేన మొట్టమొదట ప్రకటించింది. జనసేనను టీడీపీ కూడా అనుసరించింది.
కానీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం బరిలో నిలిచాయి. సంప్రదాయం పేరుతో బరి నుంచి తప్పుకున్న జనసేన… పొత్తు ధర్మమంటూ బీజేపీకి మద్దతు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక టీడీపీ కూడా అక్కడ పోటీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థికి 23,855 ఓట్లు దక్కాయి. కానీ జనసేనాని మద్దతు ప్రకటన వరకే పరిమితమై… ప్రచారానికి దూరంగా ఉన్నారని బీజేపీ చెబుతోంది.
ఎటూ మద్దతు ప్రకటించారని, ఒక్కసారి ప్రచారం చేసి వుంటే…. తమ వల్లే బీజేపీకి ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయని చెప్పుకునే అవకాశం ఉండేదని జనసేన నాయకులు అంటున్నారు. పవన్‌కల్యాణ్‌కు రాజకీయ ఎత్తుగడలు తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని వారు చెబుతున్నారు. ఇలాంటి అనుభవాల నుంచి పవన్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.