హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవడంతో ప్రతిపక్షాలు ఎగిరి గంతులేస్తున్నాయి. సంబురాలు చేసుకుంటున్నాయి. దాదాపు అన్ని ప్రతిపక్షాలు కేసీఆర్ పతనం ప్రారంభమైందని అంటున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్టీ అదే మాట. గెలవని పార్టీ అదే మాట. అసలు పోటీ చేయకుండా ఉన్నవాళ్లూ అదే మాట. టీఆర్ఎస్ పతనం ప్రారంభం కావడమంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓడిపోవడమన్నమాట. ఓడిపోతుందో, మళ్ళీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడు చెప్పలేం.
రాజకీయాల్లో బండ్లు ఓడలు కావొచ్చు, ఓడలు బండ్లు కావొచ్చు. ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది కాబట్టి కేసీఆర్ పతనం ప్రారంభమైందని అనడానికి ఆ పార్టీకి అర్హత ఉంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తో ప్రత్యక్షంగా పోరాడుతోంది. ఉప ఎన్నికలోనూ పోటీ చేసింది.
ఓడిపోయినప్పటికీ కేసీఆర్ పతనం ప్రారంభమైందని అనడానికి ఆ పార్టీకి అర్హత ఉంది. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఇమేజ్ ఉంది. అది ఎంత మేరకు ఉన్నాడనే విషయం పక్కన పెడితే టీఆర్ఎస్ తో ఢీకొనగలిగే సత్తా ఉంది. పోరాడగలిగే కేడర్ ఉంది. నాయకులున్నారు.
కానీ ఇమేజ్ లేనివారు, రాజకీయంగా బలం లేనివారు, కేడర్ లేనివారు, నాయకులు లేనివారు కేసీఆర్ పతనం తమతోనే ప్రారంభమైందని ఎలా చెప్పుకోగలరు ? కానీ చెప్పుకుంటారు.
అలా చెప్పుకున్న వ్యక్తి, కొత్త నాయకురాలు వైఎస్ షర్మిల. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న షర్మిల హుజూరాబాద్ ఫలితాలు రాగానే కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ నిప్పులు చెరిగింది. ఆ సందర్భంగా ఆమె తాను పార్టీ పెట్టిన రోజునే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అన్నది. అంటే తనను తానూ గొప్ప నాయకురాలిగా చాటుకుంటోందన్న మాట. తాను పార్టీ పెట్టగానే కేసీఆర్ భయపడ్డారని చెప్పడమన్నమాట.
హుజూరాబాద్ లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తుండగా దీనికంటే ముందుగానే తాను పార్టీ పెట్టినప్పుడే కేసీఆర్ పతనం మొదలైందని, ఆ క్రెడిట్ తనదేనని షర్మిల చెబుతోంది. తాను కూడా తెలంగాణా రాజకీయాలపై ప్రభావం చూపించగల నాయకురాలినని, తనను తక్కువ అంచనా వేయవద్దని చెప్పింది షర్మిల.
నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పతనమైతే, అందులో షర్మిల కీలక పాత్ర పోషిస్తే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అప్పటివరకు చెప్పుకునేవి గొప్పలే.