టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పుణ్యాన కాంగ్రెస్‌కు రెడ్డి సామాజిక వర్గం దూరమైంది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దళితులతో పాటు రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌తో కొనసాగుతోంది.
రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెప్పుకోతగ్గ ఓట్లు ఉండేవి. ఇది మొన్నటి మాట. ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు కూడా మాయమయ్యాయనే వాస్తవం తెలిసొచ్చింది.
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇదే ఏపీలో బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6,325 ఓట్లు రావడం ఆ పార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగిస్తోంది. హుజూరాబాద్‌లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 22 వేల ఓట్లు ఉన్నాయి. అలాగే దళితుల ఓట్లు 40 వేలు ఉన్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌లో ఊపు వచ్చిందంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఇది కేవలం ప్రచారం మాత్రమేననే విషయం నిన్నిటి హుజూరాబాద్ ఫలితం తేల్చి చెప్పింది.
తానింకా చంద్రబాబునాయుడి మనిషినే అని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం కాంగ్రెస్‌ను భారీగా దెబ్బతీస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడి పేరు వింటే కొన్ని వర్గాలకు అసలు గిట్టదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గాలను రేవంత్‌రెడ్డి తీరు హర్ట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు వల్లే తాను ఎదిగానని, అది చూసే తనను కాంగ్రెస్ ఆహ్వానించిందని రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతుండడం గమనార్హం. తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం కావడం, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌లోకి వెళ్లినట్టు రేవంత్‌రెడ్డి చెప్పడం కొందరికి పుండు మీద కారం చల్లినట్టైంది.
తనను చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారనే అర్థం ధ్వనించేలా రేవంత్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం కూడా కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి.
మరీ ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికీ రేవంత్‌రెడ్డి తన వ్యతిరేకతను ప్రదర్శించడాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారని సమాచారం.
రేవంత్ నాయకత్వంపై అసంతృప్తి, వ్యతిరేకత ఫలితమే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి దారి తీసిందని చెబుతున్నారు. చంద్రబాబుపై రేవంత్ అభిమానం చివరికి కాంగ్రెస్ వినాశనానికి దారి తీసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.