ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ వారం రోజుల్లో ఇంకాస్త తగ్గొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో జూన్ నుంచి షూటింగ్స్ మొదలుపెట్టుకోవచ్చని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొంతమంది ఏర్పాట్లు కూడా చేసుకోవడం గమనార్హం.
షూటింగ్స్ ఎప్పుడు మొదలైతే అప్పుడు సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది రాధేశ్యామ్ యూనిట్. సినిమాకు సంబంధించి వేసిన సెట్ సిద్ధంగా ఉంది. జస్ట్ 10 రోజులు వెసులుబాటు దొరికితే చాలు షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. దీనికితోడు అందరికంటే కాస్త ముందుగా షూటింగ్ మొదలుపెడితే.. పూజా హెగ్డే కాల్షీట్లతో సమస్య ఉండదు. అందుకే రాధేశ్యామ్ యూనిట్ తొందర పడుతోంది.
అటు ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ యూనిట్లు కూడా రెడీగా ఉన్నాయి. సలార్ సెట్స్ పైకి రావడానికి కాస్త టైమ్ పట్టొచ్చు కానీ, ఆదిపురుష్ యూనిట్ మాత్రం స్పీడ్ గా ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే రామోజీ ఫిలింసిటీలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభించడానికి వీళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అటు బాలయ్య కూడా తన కొత్త సినిమా అఖండను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి రావడానికి తను సిద్ధంగా ఉన్నానని, ఏర్పాట్లు చేసుకోమని దర్శకుడు బోయపాటికి చెప్పేశాడు.
ఆచార్య షూటింగ్ కూడా కేవలం 10-12 రోజులు మాత్రమే పెండింగ్ ఉందని కొరటాల తాజాగా స్పష్టంచేశాడు. తామంతా షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు. కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయితే, రామ్ చరణ్ వెంటనే రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాడనే విషయాన్ని కూడా కొరటాల బయటపెట్టాడు.
వీటితోపాటు ఆర్ఆర్ఆర్, పవన్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్, హరిహర వీరమల్లు సినిమాలు, నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. కేసులు తగ్గి ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే ఇవన్నీ ఒకేసారి సెట్స్ పైకి రాబోతున్నాయి. తెలంగాణలో జూన్ రెండో వారం నుంచి షూటింగ్స్ కు అనుమతులు లభించే అవకాశం ఉంది.