క‌క్ష సాధింపా..కార్య‌సాధ‌నా.. ?

ఏదైనా సాధించడం వేరు..ఎవరినైనా సాధించడం వేరు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, మళ్లీ అధికారం సాధించడం కోసం, ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయడం కన్నా జగన్ ను సాధించడం పైనే ఎక్కువ దృష్టి…

ఏదైనా సాధించడం వేరు..ఎవరినైనా సాధించడం వేరు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, మళ్లీ అధికారం సాధించడం కోసం, ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయడం కన్నా జగన్ ను సాధించడం పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అలా సాధిస్తూ పోవడం వల్ల పార్టీకి ఒనగూరేది, దేశం సాధించేది ఏమీ వుండదని అర్థం కావడం లేదు.

ఇక్కడ తెలుగుదేశం పార్టీ గమనించాల్సింది ఏమిటంటే కొన్నేళ్ల కిందటి సంగతేమో కానీ ఇప్పుడు ఆంధ్రలో జనం మూడు రకాలుగా విడిపోయారు. ఒకటి జగన్ అనుకూల వర్గం. రెండు తెలుగుదేశం అనుకూల వర్గం. మూడు న్యూట్రల్ వర్గం . తెలుగుదేశం చేస్తున్న వ్యవహారాలు కానీ, ప్రయత్నాలు కానీ రెండు పనులు సాధించే దిశగా సాగాల్సి వుంది. 

ఒకటి న్యూట్రల్ వర్గం మొత్తాన్ని తమ పార్టీ వైపు తిప్పుకోవడం. రెండు జగన్ అనుకూల వర్గంలో కొంతయినా చీలిక తేగలగడం. జగన్ కన్నా చంద్రబాబు బెటర్ లేదా వైకాపా కన్నా తెలుగుదేశం బెటర్ అన్న ఫీలింగ్ తీసుకురాగలిగితే ఇది కొంత వరకు సాధ్యం అవుతుంది.

కానీ గత ఏణ్ణర్ధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పార్టీ కానీ తీసుకుంటున్న కార్యక్రమాలు ఎలా వున్నాయి అంటే సిమెంట్ లో నీళ్లు పోసిన చందంగా. అలా చేస్తే సిమెంట్ గడ్డ కట్టేస్తుంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనుల వల్ల జగన్ అనుకూలం అనే వర్గం మరింతగా బలపడిపోతోంది. పోనీ న్యూట్రల్ వర్గం ఇటు వస్తోందేమో అని అనుకుందాం అంటే అదీ అనుమానంగానే వుంది. ఈ న్యూట్రల్ వర్గం లెక్క ఎన్నికల టైమ్ కు మాత్రమే బయటపడుతుంది.

జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో విధంగా కోర్టుకు ఈడ్చడం, అక్కడ అడ్డుకట్ట పడడం. తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా చంకలు గుద్దుకోవడం వార్తలు రాసుకోవడం. కానీ ఇది జగన్ అనుకూల వర్గంలో అతని పట్ల మరింత సానుభూతిని పెంచుతోంది అని గమనించడం లేదు. జగన్ ను కేవలం కోర్టుల ద్వారా కార్నర్ చేసి సాధిస్తున్నారని ఆ వర్గం కచ్చితంగా అభిప్రాయపడుతోంది. 

కొర్టుల విషయంలో కామెంట్ చేయడం అనేది పద్దతి, న్యాయబద్దం కాదు కనుక ఇక్కడ రాయడం లేదు కానీ సోషల్ మీడియాలో, వాట్సాప్ ల్లో, వాట్సాప్ స్టేటస్ ల్లో చలామణీ అవుతున్న అనేక విషయాలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి తీర్పు తరువాత ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా వుంటున్నాయి.

ఆ వ్యవహారాల సంగతి కాదు ఇక్కడ చూడాల్సింది, మాట్లాడుకోవాల్సింది. జగన్ అనుకూల వర్గంలో ప్రతి కేసుకు మరింత పట్టుదల లేదా గట్టిదనం చేకూరుతున్నట్లు కనిపిస్తోందన్నది. అంటే కోర్టులకు వెళ్లి తెలుగుదేశం సాధిస్తున్నది ఏదైతే వుందో, అది ఆ వర్గానికి జగన్ ను సాధిస్తోన్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా ఆ వర్గం జగన్ ను మరింత గట్టిగా అంటిపెట్టుకుని వుండేందుకు దారి తీస్తోంది. 

జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ ఇది కూడా కోర్టు మెట్లు ఎక్కుతుంది. అక్కడ ఎలాగూ వీగిపోతుందని సామాన్య జనం ముందే తీర్పు చెప్పేసే పరిస్థితి ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడుతోంది. అంటే కోర్టు తీర్పు ఎలా వుండబోతోందో ముందే జనం ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. అందువల్ల కోర్టు తీర్పులు అన్నవి తెలుగుదేశం మీడియాలో 'జగన్ కు షాక్' అనే హెడ్డింగ్ లకు తప్ప, జనాలకు షాక్ గా అనిపించడం లేదు.

రాను రాను ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటే కోర్టులో తెలుగదేశం పార్టీ జనాలు కేసులు వేయడం, జగన్ గు వ్యతిరేకంగా తీర్పులు రావడం, మీడియాలో 'షాక్' హెడ్డింగ్ లు ఇవన్నీ జస్ట్ 'టేకిట్ ఈజీ' మారిపోయేలా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఎంపీటీజీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసునే చూసుకుందాం. దానికి టెక్నికల్ రీజన్లు ఏమిటీ? కోర్టు ఎందుకు కొట్టేసింది? లాంటి వాటి జోలికి మనం పోవడం లేదు. కానీ ఇలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ సాధించింది ఏమిటి?

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తే, ఒక్క సీటు అదనంగా సాధించగలదా? ఎంపీటీసీ పదవులు ఎంత అలంకార ప్రాయమో తెలియంది కాదు. చాలా అంటే చాలా మండలాల్లో ఆ పదవులకు పోటీ పడేవారే లేరు. అది ఏ పార్టీ అయినా, ఎవరో ఒకర్ని పిలిచి 'నువ్వే ఎంపీటీసీ మెంబర్' అని చెప్పి, చేతిలో పెట్టాల్సిందే. 

జెడ్పీటీసీ మెంబర్ అంటే అంతకన్నా కొంచెం అంటే కొంచెం బెటర్. ఇలాంటి ఎన్నికల విషయంలో పట్టుబట్టి సాదించింది ఏమిటి? 'జగన్ కు కోర్టు షాక్' అనే ఓ హెడ్డింగ్ తప్ప. కానీ అదే టైమ్ లో సోషల్ మీడియాలో ఎన్నో హెడ్డింగ్ లు, కౌంటర్లు, సెటైర్లు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కనిపించని చేటు చేస్తున్నాయి. ఆ సంగతి ఆ పార్టీ గమనించుకోవడం లేదు.

ఎంతసేపూ జగన్ ను ఏదో విధంగా సాధిస్తున్నాం అని తెలుగుదేశం నాయకులు సంతోషపడుతున్నారు తప్ప,  ఒక్కో వర్గంలో జగన్ పాతుకుపోతున్నాడని గమనించడం లేదు. ఇప్పటికే క్రిస్టియన్లు ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్లను దూరం చేసుకుంది. ఇమామ్ లకు డబ్బులు ఇస్తున్నారని దేశం అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ద్వారా ముస్లింలను దూరం చేసుకుంటున్నారు. 

బడ్జెట్ లో బిసి లకు పెద్ద పీట వేయడం ద్వారా, బిసి కార్పొరేషన్లు సెపరేట్ గా పెట్టడం ద్వారా వాళ్లను జగన్ పూర్తిగా ఓన్ చేసుకుంటున్నారు. నిర్మొహమాటంగా సంక్షేమ బడ్జెట్ ప్రవేశ పెట్టేసారు. మూడో ఏడాది కూడా జనాలకు పంపిణీ కొనసాగిపోతుంది. అప్పులు చేసారా, మరెలా తెచ్చారు అన్నది పక్కన పెడితే 2023 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్ట్ లో ఈ పథకాల కంటిన్యూనిటీ మీద క్లారిటీ ఇచ్చి తీరాల్సి వుంటుంది. 

అన్న క్యాంటీన్లు కొనసాగించలేదు అంటూ పదే పదే జగన్ ను విమర్శించడం సరే, జగన్ చేస్తున్న పంపిణీ పథకాలు తాము కొనసాగిస్తామని, వీలయితే ఇంకొంచెం ఎక్కువే ఇస్తామని కచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాల్సి వుంది. అలా పెట్టకపోతే జనం చంద్రబాబును ఆయన పార్టీని ఇలా ఎడం చేత్తో తీసి, అలా పక్కన పెడతారు. లేదు మేనిఫెస్టోలో పెడితే, ఇన్నాళ్లూ జగన్ అప్పులు చేసి, జనాలకు పంచేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారని చేసిన విమర్శలకు లెంపలు వేసుకుని సమాధానం చెప్పాల్సి వుంటుంది. 

అప్పుడు కచ్చితంగా ఒకటే అంటుంది. డబ్బులు పంచడం తప్పు అని నిన్న చెప్పి, తాము పంచుతామని ఈ రోజు చెప్పడం అంటే ఏమనుకోవాలని? ఇలాంటి వాళ్లను నమ్ముతారా? ఇప్పటికే ఇస్తున్నవారిని నమ్ముతారా? అని నిలదీస్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోతుంది. ఇక ఇంకో సంగతి, చంద్రబాబు కేవలం విశాఖ, విజయవాడ లాంటి పట్టణాల సుందరీకరణ మీదే దృష్టి పెట్టారు. కానీ జగన్ ప్రతి పల్లెలోవున్న స్కూళ్లు, ఆరోగ్యకేంద్రాల సుందరీకరణ మీద దృష్టి పెట్టారు. అందువల్ల ఇవన్నీ జనం కళ్ల ముందు కనిపిస్తున్నాయి. 

కేవలం డబ్బులు పంచుతున్నారు అని అనడం మరి జనాలకు ఎంత వరకు పడుతుంది. పైగా పంచుతున్నది వాళ్లకేగా. ఇలాంటి ప్రచారానికి తెలుగుదేశం పార్టీకి రాలే ఓట్లు ఎక్కడివి, మహా అయితే పట్టణాల్లో వున్న కొన్ని ఓట్లు. అవి ఎప్పడూ న్యూట్రల్ ఓట్లే. ఎన్నికల ముందే అవి ఎటు మొగ్గుతాయో క్లారిటీ వస్తుంది. కేవలం వీటి కోసం అని తెలుగుదేశం పార్టీ తప్పు తోవలోపోతూ, ఏదో సాధిస్తున్నాం అనుకుని, జగన్ ను సాధించుకుంటూ పోతూ, ఏదీ సాధించలేక చతికిలపడిపోతోంది. 

ఈ సత్యం గమనింపు వరకు వచ్చేసరికి తెలుగుదేశం పునాదులు చాలా వరకు పాడయిపోతాయి అన్నది వాస్తవం. ఈ వాస్తవానికి ఎంత త్వరగా గ్రహించి,ఈ కేసులు, సాధింపులు పక్కన పెట్టి, పార్టీని పటిష్టం చేసుకుని, ఆ విధంగా విజయం సాధించడం మీద ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత మంచింది

చాణక్య