దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త కేసుల ప్రభావం తగ్గింది. ఈ దశలో మే నెలాఖరు వరకు ఉన్న కర్ఫ్యూ పొడిగించే అవసరం లేదని అంటున్నారు నిపుణులు. అదే జరిగితే.. ఆ తర్వాత జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఒక్కసారిగా అన్నీ చక్కబడతాయని చెప్పలేం కానీ.. క్రమక్రమంగా పాత పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.
ఇక విద్యావ్యవస్థ విషయానికొస్తే.. కొన్ని రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షల్ని వాయిదా వేశాయి, మరికొన్ని రాష్ట్రాలు ఏకంగా రద్దు చేసి ఇంటర్నల్ మార్కులతో రిజల్ట్ ప్రకటించేశాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం, జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షల్ని మాత్రం యథాతథంగా నిర్వహిస్తామంటోంది. దాదాపుగా కరోనా పరిస్థితి కూడా ప్రభుత్వ నిర్ణయానికి సహకరించేలా ఉంది. పది పరీక్షలు జరిగాయంటే.. వాయిదా పడిన ఇంటర్ పరీక్షలకు కూడా మార్గం సుగమం అయినట్టే.
తెలంగాణ విషయానికొస్తే.. పదో తరగతి పరీక్షల విషయంలో వాయిదాలు పెట్టకుండా ఆల్ పాస్ అనేసింది ప్రభుత్వం. ఈమధ్యే రిజల్ట్ కూడా ఇచ్చి మమ అనిపించేశారు అధికారులు. ఇంటర్ పరీక్షలు మాత్రం వాయిదా వేశారు. వాటిపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అన్నీ కుదిరితే జూన్ రెండో వారంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటిస్తామని, లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందడుగు వేయాలని తెలంగాణ అధికారులు నిర్ణయించారు.
ఇంటర్ పరీక్షలు జరిగితే.. ఎంసెట్ కి కూడా మార్గం సుగమం అవుతుంది. మిగతా అకడమిక్ కేలండర్ అంతా కాస్త లేట్ గా అయినా సరే.. సజావుగా సాగే అవకాశం ఉంటుంది. యూనివర్శిటీల పరిధిలో మిగిలి ఉన్న డిగ్రీ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఇంటర్ పరీక్షల విషయంలో చివరి నిముషంలో వెనక్కి తగ్గిన ఏపీ సర్కారు.. పదో తరగతి పరీక్షల విషయంలో మాత్రం పట్టుదలగా ఉంది. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని, ఒక్క కేసు కూడా కొత్తగా లేకుండా పది పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది.
కష్టపడి చదువుకునే విద్యార్థులకు అప్పుడే న్యాయం చేసినట్టు అవుతుంది. కరోనా బ్యాచ్ అనే ముద్ర విద్యార్థులపై పడకుండా ఉంటుంది. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాబోతున్నాయి.