ఇండస్ట్రీలో ఓ సినిమా ఛాన్స్ దక్కించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని నిలుపుకొని, మరో ఛాన్స్ దక్కించుకోవడం అంతకంటే పెద్ద కష్టం. కానీ టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, అన్నీ కలిసిరావాలి. అలా కలిసిరాక ఓ దర్శకుడు ఇబ్బందిపడుతున్నాడు. కాజల్ తో సినిమా ఓకే చేయించుకున్న ఆ డైరక్టర్, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఓ పొజిషన్ లో ఉండేవాడు.
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు జయశంకర్. టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంతోష్ శోభన్ ను పేపర్ బాయ్ తో హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది ఈ దర్శకుడే. ఈ సినిమా కంటే ముందు సంతోష్ ఓ సినిమాతో హీరోగా పరిచయమైనప్పటికీ.. పేపర్ బాయ్ తోనే అతడికి ఓ గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఈ మూవీకి టీవీల్లో మంచి రేటింగ్ వస్తోంది. హీరో సంగతి పక్కనపెడితే, పేపర్ బాయ్ ఇచ్చిన ఉత్సాహంతో మంచి ఫిమేల్ సెంట్రిక్ కథ రాసుకున్నాడు జయశంకర్.
ఆ కథతో వెళ్లి కాజల్ ను కలిశాడు. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఆమెను మెస్మరైజ్ చేశాడు. కథ నచ్చడంతో వెంటనే కాల్షీట్లు కూడా ఇచ్చింది కాజల్. సినిమా కూడా ఫార్మల్ గా లాంఛ్ అయింది. అయితే అంతలోనే లాక్ డౌన్ పడింది. ఆ గ్యాప్ లోనే కాజల్ లవ్ మేటర్ బయటపెట్టింది. ఆ వెంటనే పెళ్లి కూడా చేసుకుంది. ఈలోగా ఇతర సినిమాలతో బిజీ అయింది. ఆ తర్వాత గర్భందాల్చడం, బాబుకు జన్మనివ్వడం తెలిసిందే.
ఇలా కళ్ల ముందే అమూల్యమైన మూడేళ్లు కరిగిపోయాయి.. మళ్లీ కాజల్ ఎప్పుడు సెట్స్ పైకొస్తుందో.. ఈ దర్శకుడి కలల ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓవైపు చిన్నచిన్న సినిమాలు తీసిన దర్శకులు కూడా 2-3 ప్రాజెక్టులు పట్టేస్తున్నారు. దీంతో జయశంకర్ అదే సబ్జెక్టు తో మరో టాప్ హీరోయిన్ ని అప్రోచ్ అయ్యాడు. అలానే మరో సబ్జెక్ట్ తో ఓ మిడ్-రేంజ్ హీరోను కూడా లైన్ లో పెట్టాడు. కాని అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవ్వరికీ తెలియదు. కాలమే నిర్ణయించాలి.
ప్రస్తుతం ఈ దర్శకుడు.. అనసూయ లీడ్ రోల్ గా ఓ ఆంథాలజీ చేస్తున్నాడు. తన హోప్స్ అన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా రిజల్ట్ పైనే అతడి కెరీర్ ఆధారపడి ఉంది.