లైంగిక దాడికి గురైన మానసిక వికలాంగురాలిని పరామర్శించడానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ దాడికి పాల్పడింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. విజయవాడ ప్రభుత్వాస్ప త్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడడంపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇటీవల మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తూ… ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన వాసిరెడ్డి పద్మను మహిళా, ప్రజా సంఘాల నేతలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అయినప్పటికీ బాధితురాలిని పరామర్శించడానికి వెళుతున్న ఆమెపై దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారి తీసింది.
అధికార పార్టీ కార్యకర్తలు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా వుండగా బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన వాసిరెడ్డి పద్మపై దాడికి పాల్పడడాన్ని అధికార పార్టీ తప్పు పడుతోంది. ఇదేనా టీడీపీ సంస్కారం అని ప్రశ్నిస్తోంది. పద్మ కూడా బాధితురాలికి అండగా నిలిచేందుకు వెళ్లిన విషయాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది.
ఇటీవల ఏదో ఒక ప్రాంతంలో యువతులు, మహిళలపై లైంగిక, భౌతికదాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు పెరిగాయనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఎక్కడేం జరిగినా పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ వెళుతున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. బాధితులకు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నారు.
కానీ సమాజంలో మహిళలను భోగ వస్తువుగా చూసే దృష్టిపై చైతన్యం కలిగించే మహిళా కమిషన్ సదస్సులు నిర్వహించాల్సి వుంటుంది. అంత వరకూ మహిళలపై దాడులను నిలువరించడం సాధ్యం కాదు. స్త్రీలను గౌరవించే సంస్కృతిని పెంచే దిశగా మహిళా కమిషన్ తన వంతు కృషి చేస్తే …నేడు ఇలాంటి దుర్మార్గాలను చూడాల్సిన దుస్థితి ఎదురుకాదనేది పౌర సమాజం భావన.