ఈ భూమి ఒక ఆకర్షణ, వికర్షణ. బతికినంత కాలం వంద గజాల కోసమో, నాలుగెకరాల కోసమో పోరాటం చేస్తాం. రాజులైతే యుద్ధాలు చేస్తారు. భూమిపైన మనకు మోహం, భూమికి కూడా మనపై అంతే. చక్రవర్తుల్ని, భిక్షగాళ్లని సమానంగా చూసి ఆరడుగుల నేలని దానం చేస్తుంది.
యూనివర్స్ అర్థమైతే భూమి అర్థమవుతుంది. భూమి మర్మం తెలిస్తే జీవన సారాంశం తెలుస్తుంది. మనిషి ఎంత సూక్ష్మ ప్రాణో ఈ భూమి మీద. విశ్వంలో వేలాడే బంతి ఈ భూమి. ఏదైనా గ్రహానికి, లేదా శకలానికి పిచ్చిలేచి దాన్ని ఢీకొంటే సమస్త నాగరికత, జ్ఞానం, ఆకలి, ద్వేషం, దురాశ అన్నీ మాయం.
భూమికి మనం అతిథులు. కొంత మంది ఎక్కువ రోజులుంటారు. కొందరు త్వరగా వెళ్లిపోతారు. పోవడం పక్కా. ఉండాలనుకున్నా భూమి ఒప్పుకోదు. ఇది రూల్ అయితే మనమే చాలా కాలం ఉండిపోతామనే భ్రమతో మనంతటి వాడు లేడని విర్రవీగి చివరికి మన్నుగా మిగిలిపోతాం.
భూమిని మనం గౌరవించాలి. దాని చట్టాన్ని అంగీకరించాలి. మొదట మనకు తెలియాల్సింది ఈ భూమి మనది మాత్రమే కాదు. మనతో పాటు కోట్లాది ప్రాణులకు కూడా హక్కుంది. కాకపోతే మన దగ్గర దస్తావేజులు, పాస్‌పోర్టు, వీసాలు వుంటాయి. మిగతా ప్రాణులకి అవి అవసరం లేదు. కలిసి పంచుకోవడం వాటికి తెలుసు. మనుషులకి తెలియనది అదే.
ఇది రాస్తున్నప్పుడు గదిలో నేను ఒంటరిని కాదు. దూరంగా గోడపైన రెండు చిన్న పురుగులు కదులుతున్నాయి. ఈ ఇంట్లో నాతో పాటు ఒక కుటుంబం ఉందన్న మాట. కొంచెం దూరంలో ఒక బల్లి “క్ క్” మని చప్పరిస్తూ వుంది. ఒకటి రెండు సాలీడ్లు కూడా ఉండే ఉంటాయి. వేల పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, వాటిని చదవడానికి చెదలు కూడా ఉండొచ్చు. కంటికి కనపడని సూక్ష్మజీవులు ఎన్నో. బాల్కనీలో పావురాలు “గూగ్ గూగ్” అంటున్నాయి.
ఇది చదువుతున్నపుడు గమనించండి మీరు కూడా ఒంటరి కాదు. మీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కంపెనీ వుంది. దూరంగా కుక్కల అరుపులు వినిపిస్తూ వుంటాయి. అదృష్టం బాగుంటే మేకల అరుపులు, పిల్లి మియావులు కూడా వినొచ్చు. మనతో పాటు ప్రాణులకి, మొక్కలకి కూడా బతికే హక్కుంది. మన కంటే ఎక్కువ హక్కు. ప్రకృతిని నాశనం చేయడం వాటికి తెలియదు. మన పనే అది.
మనకు నోరుంది. అభిప్రాయాలు చెప్పగలం. ఒక పులి లేదా పిల్లి చెప్పలేవు. పాపాలు ఎక్కువ చేస్తాం కాబట్టి మనకు దేవుడు అవసరం. జంతువులకి అవసరం లేదు. పాప భారంతో తిరుమల కొండకి వెళుతున్నామనుకో, ఘాట్‌రోడ్డులో పులి కనిపిస్తుంది. వెంటనే టీవీలో బ్రేకింగ్ న్యూస్. ఫారెస్ట్ అధికారుల హడావుడి. అడవి అంటే పులి ఇల్లు. దాని ఇంట్లోకి మనం వెళ్లి , మనింట్లోకి అది వచ్చినట్టు గోల చేస్తాం.
అడవులు నరికేసి ఫ్యాక్టరీలు కడ్తాం. కొండలు పిండి చేసి కంకర చేస్తాం. సమస్త కాలుష్యాన్ని సముద్రం మీదికి వదులుతున్నాం. ఇదంతా అభివృద్ధి. తిండిలేక ఏనుగులు ఊళ్లలోకి వస్తే గజరాజుల దాడి. కొండల్లో బతికే గిరిజనులు పొయ్యిలోకి పుల్లల కోసం ఒక చెట్టు కొడితే చట్టాల ఉల్లంఘన.
మనం మాత్రమే బతుకుతామంటే ప్రకృతి ఒప్పుకోదు. అది తనకు తాను శుభ్రపరచుకుంటుంది. అందుకే కరోనా. మనిషిని ఏడాది పాటు బయటికి రాకుండా చేసి ప్రకృతి సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంది. సముద్రాన్ని గౌరవించకపోతే తుపాన్లు, సునామీలతో లెక్క సమానం చేస్తుంది. భూమి భూకంపాన్ని చూపిస్తుంది. భూకంపం అంటే భూమి కోపం, సునామీ అంటే సముద్రపు కన్నీళ్లు.
మొక్కకు ఇన్ని నీళ్లు, పక్షికి కాసిన్ని గింజలు అని పెద్దవాళ్లు చెప్పింది ప్రకృతి సూత్రం. దేవుళ్ల వాహనాలుగా జంతువుల్ని వుంచడం ఎందుకంటే అది ప్రాణుల్ని ప్రేమించే నియమం.
పిచ్చుకల్ని జన జీవితంలోంచి తరిమేశాం. సుబ్రమణ్యస్వామి కావళ్లు మోస్తాం. నెమళ్లని అంతరించే స్థితికి తెచ్చాం.
గుడిలో ప్రదక్షిణలు చేసే ధ్వజస్తంభం కూడా ఒకప్పుడు అడవిలో బాగా బతికిన చెట్టు. ప్రకృతి నుంచి అవసరానికి తీసుకోవడం న్యాయం. అవసరం మించితే అన్యాయం.
పిల్లలకి ఐఐటీ ఫౌండేషన్, ఇంగ్లీష్ చదువులిస్తున్నామని సంబరపడతాం కానీ, వాళ్లకి ఒక విషపూరిత ప్రపంచాన్ని కూడా ఇస్తున్నాం. (ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం)
-జీఆర్ మహర్షి