సీనియర్ హీరోలకు మరో హీరో దన్ను కావాలి. లేదంటే జనం చూడరేమో అన్న భయం. ఈ ప్రయోగాన్ని విక్టరీ వెంకటేష్ ఏనాడో ప్రారంభించారు.
అయితే మన సీనియర్ హీరోలతో సమస్య ఏమిటంటే యంగ్ హీరోల తోడు కావాలి. కానీ వాళ్లకు అంతంత మాత్రం ప్రాధాన్యత ఇచ్చి సరిపెడతారు. రామ్ లాంటి వాళ్లు వెంకీతో సినిమా చేసి బోర్లా పడ్డారు. ఇక అప్పటి నుంచి కాస్త పేరున్న యంగ్ హీరోలు సీనియర్ హీరోల సినిమాలో నటించమంటే ఏదో ఒక సాకు చెప్పి మొహం చాటేస్తున్నారు.
వెంకటేష్ మాదిరిగానే మెగాస్టార్ కూడా మరో హీరోను తోడు చేసుకోవడం ప్రారంభించారు. వాల్తేర్ వీరయ్య లో రవితేజ కనుక ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చారు భోళాశంకర్ లో సుశాంత్ ను తీసుకున్నారు. సుశాంత్ పక్కన హీరోయిన్ కీర్తి సురేష్. కానీ ఇద్దరి మధ్య సరైన సీన్ ఒక్కటి వుంటే ఒట్టు.
కనీసం యంగ్ పెయిర్ నడుమ ఓ పాట పెట్ట వచ్చు కదా. అబ్బే.. అన్ని పాటలు మెగాస్టార్ కే వుండాలి. ఇద్దరి మధ్య కనీసం ఓ లవ్ సీన్ కూడా సరైనది ప్లాన్ చేయలేదు.
మరి ఇలా అయితే యంగ్ హీరోలు మెగాస్టార్ తో ఎందకు చేయాలి. కళ్యాణ్ కృష్ణ సినిమాకు ఓ యంగ్ హీరో కావాలి. సిద్దు జొన్నలగడ్డను సంప్రదించారు కానీ పాజిటివ్ రిప్లయ్ రాలేదని సమాచారం. ఇంక ఎవరు దొరుకుతారు. సత్యను తీసుకోవాల్సిందే. గాడ్ ఫాదర్ లో విలన్ చేసాడు కనుక ఈ సారి హీరోతో సమాన మైన పాత్ర ఆఫర్ చేసుకోవచ్చు.
సిద్దు, సత్య ఎవరైనా కావచ్చు. వాళ్లకు ఇవ్వాల్సిన ప్రామినెన్స్ వాళ్లకు ఇవ్వకుండా, సినిమాలు వున్నారు అన్నట్లు చేస్తే భవిష్యత్ లో మెగాస్టార్ పక్కన చేయడానికి మరే యంగ్ హీరో ముందుకు రారు. మెగా హీరోల్లో వున్న యంగ్ బ్యాచ్ ను ట్రయ్ చేయాల్సిందే.