తన సొంత సంస్థపై పట్టు కోల్పోయిన జీ గ్రూప్

అనుకున్నట్టే జరిగింది. అత్యథికంగా లాభాలు ఆర్జించి పెడుతున్న కంపెనీపై జీ గ్రూప్ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. స్టాక్ మార్కెట్లో కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. జీ గ్రూప్ సంస్థ.. తనకు చెందిన జీ…

అనుకున్నట్టే జరిగింది. అత్యథికంగా లాభాలు ఆర్జించి పెడుతున్న కంపెనీపై జీ గ్రూప్ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. స్టాక్ మార్కెట్లో కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. జీ గ్రూప్ సంస్థ.. తనకు చెందిన జీ ఎంటర్ టైన్ మెంట్స్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL-జీల్)పై ఆధిపత్యాన్ని కోల్పోయింది. ఈ సంస్థలో అత్యథిక వాటాను సోనీ గ్రూప్ దక్కించుకుంది.

జీ గ్రూప్ లో ఎన్నో సంస్థలున్నాయి. జీ లెర్న్, జీ డిజిటల్, జీ మీడియా, జీల్, జీ ఇన్ఫ్రా.. ఇలా చాలా కంపెనీలున్నాయి. అయితే వీటిలో పూర్తిస్థాయిలో లాభాలు అందుకుంటున్న సంస్థ మాత్రం జీల్ మాత్రమే. జీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ అన్నీ ఈ గ్రూప్ పరిథిలోకే వస్తాయి. ఇప్పుడీ గ్రూప్ పైనే తన ఆధిపత్యాన్ని కోల్పోయింది జీ సంస్థ.

సోనీ ఇండియా సంస్థ.. జీల్ లో 1.57 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ డీల్ ద్వారా సోనీ సంస్థకు జీల్ లో 52.93 శాతం వాటా దక్కగా.. జీ షేర్ హోల్డర్స్ కు 47.07 శాతం వాటా మాత్రమే మిగిలింది. ఇకపై కంపెనీలో కీలకమైన నిర్ణయాలన్నీ సోనీ ఇండియా తీసుకుంటుంది. 

బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ను ఎంతమందిని నియమించాలి, ఎవర్ని నియమించాలనే అంశాలన్నీ సోనీ ఇండియా చేతికి వెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు ఎండీ-సీఈవోగా ఉన్న పునీత్ గోయంకా.. ఒప్పందం ప్రకారం, ఆ పదవిలో మరో ఐదేళ్లు మాత్రమే కొనసాగబోతున్నారు. తాజా ఒప్పందంతో మార్కెట్లో ఈ సంస్థ షేర్ వాల్యూ పెరిగింది.

తాజా ఒప్పందంతో జీల్ కు చెందిన ఎన్నో ఎస్సెట్స్ పై సోనీ ఇండియాకు హక్కు దక్కుతుంది. ఇకపై జీల్ లో ఉన్న ప్రొగ్రామ్ లైబ్రలీ, ప్రొడక్షన్ ఆపరేషన్స్ పై సోనీకి కూడా హక్కులు ప్రాప్తిస్తాయి. జీ గ్రూప్ వద్ద వివిధ భాషలకు చెందిన దాదాపు 2వేలకు పైగా సినిమాలున్నాయి. ఇకపై వీటిని సోనీ-జీ గ్రూప్ సంస్థలు పంచుకునే అవకాశం ఉంది. రీసెంట్ గా సోనీ సౌత్ లో ఎంటరైంది. సోనీ లివ్ అనే ఓటీటీని ప్రవేశపెట్టింది. జీ గ్రూప్ తో ఒప్పందం, ఈ ఓటీటీకి కలిసొచ్చేలా ఉంది.

జీ గ్రూప్ తాజాగా ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్, హిందీ శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. కేజీఎఫ్-2, రాధేశ్యామ్ రైట్స్ కూడా ఈ సంస్థ వద్దే ఉన్నాయి. వీటితో పాటు పలు భారీ చిత్రాల హక్కుల్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. తాజా ఒప్పందంతో జీ గ్రూప్ కు నిధుల కొరత పూర్తిగా తీరనుంది. కాకపోతే దశాబ్దాలుగా ఈ గ్రూప్ పై ఉన్న పట్టును గోయెంకా కుటుంబం కోల్పోయింది.