మళ్లీ రేసులోకి ఎంటరైన జీ గ్రూప్

దాదాపు 7-8 నెలలుగా శాటిలైట్ మార్కెట్ కు దూరంగా ఉంది జీ గ్రూప్. ఈ కంపెనీకి తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. వ్యవస్థాగతంగా చేసిన పొరపాట్ల వల్ల ఇది చాలా నష్టాలు ఎదుర్కొంది. ఏకంగా…

దాదాపు 7-8 నెలలుగా శాటిలైట్ మార్కెట్ కు దూరంగా ఉంది జీ గ్రూప్. ఈ కంపెనీకి తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. వ్యవస్థాగతంగా చేసిన పొరపాట్ల వల్ల ఇది చాలా నష్టాలు ఎదుర్కొంది. ఏకంగా ఫౌండర్ సుభాష్ చంద్ర, ఛైర్మన్ స్థానం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇలా ఎన్నో ఆటుపోట్లు ఎదురుచూసిన ఈ సంస్థ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కుదురుకుంటోంది. శాటిలైట్ మార్కెట్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది.

జీ తెలుగు లేకపోవడంతో మొన్నటివరకు తెలుగు శాటిలైట్ మార్కెట్ లో ఓ రకమైన స్తబ్దత ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలంతా జెమినీ లేదా స్టార్ మా ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కొన్ని మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలైతే అమ్ముడుపోలేదు కూడా. ఇప్పుడు జీ తెలుగు రాకతో మరోసారి ఇండస్ట్రీలో ఉత్సాహం కనిపిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో పెద్ద సినిమా కొనుగోలు చేయని జీ తెలుగు.. ఇప్పుడు వరుసపెట్టి సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకుంటోంది. సాయితేజ్ నటిస్తున్న సోలో బతుకే సో బెటర్ సినిమా హక్కుల్ని ఈ సంస్థ దక్కించుకుంది. దీంతోపాటు రామ్, నితిన్ అప్ కమింగ్ సినిమాల రైట్స్ కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది.

ఇలా మీడియం రేంజ్ సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకుంటూనే మరోవైపు పెద్ద సినిమాలపై కూడా కన్నేసింది. ఇప్పటికే సాహో శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఈ సంస్థ.. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యతో మరోసారి చర్చలకు తెరతీసింది. అటు ఆచార్య సినిమా కోసం సంప్రదింపులు మొదలుపెట్టింది. దీంతోపాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ త్వరలోనే చేయబోయే సినిమాలతో పాటు.. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఓ సినిమాపై కూడా ఫోకస్ పెట్టింది.

మొన్నటివరకు శాటిలైట్ సెగ్మెంట్ లో మోనోపొలీ నడిచింది. జెమినీ కాదంటే స్టార్ మా మాత్రమే దిక్కు. ఈటీవీ ఈ వ్యవహారం నుంచి ఎప్పుడో తప్పుకుంది. ఇప్పుడు జీ తెలుగు రాకతో త్రిముఖ పోటీ మరోసారి మొదలైంది. దీనివల్ల ఛానెల్స్ తో పాటు ఇండస్ట్రీకి కూడా మంచిది. అన్నట్టు శాటిలైట్ మార్కెట్ తో పాటు డిజిటల్ పై కూడా సీరియస్ గా దృష్టిపెట్టింది జీ గ్రూప్. ఏడాది కిందటే మొదలుపెట్టిన జీ5 అనే స్ట్రీమింగ్ యాప్ కోసం పెద్ద సినిమాల డిజిటల్ రైట్స్ తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధంచేసింది. అలా అమెజాన్ కు పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది