cloudfront

Advertisement


Home > Movies - Reviews

భరతుడు రానే వచ్చాడు.. చేసిందే మళ్లీ చేశాడు..

భరతుడు రానే వచ్చాడు.. చేసిందే మళ్లీ చేశాడు..

‘‘ప్చ్‌.. మన వాళ్లింతేనోయ్‌.. ఏం మారరు..’’ అనుకొనేలా చేసిన చిత్రం ‘భరత అనే నేను’. వ్యక్తిపూజ మన నరనరాల్లో ఎలా పాతుకుపోయి ఉందో ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పదని.. దానిని మారిస్తే తప్ప పరిస్థితులు మారవని మనం ఎప్పుడూ నమ్మం. సరిగ్గా ఈ సూత్రాన్నే ఈ సినిమాలో దర్శకుడు చెప్పకనే చెప్పాడు.

నాయకుడవసరం లేని వ్యవస్థను తయారుచేసేవాడే నిజమైన నాయకుడనే సింగిల్‌ లైనులో చెప్పిన దర్శకుడు ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్‌ చేయటంలో పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తం సినిమా అంతా వెతికిచూసినా లోపభూయిష్టమైన వ్యవస్థను బలోపేతం చేయటానికి హీరో చేసిన ఒక్క ప్రయత్నం కూడా కనబడదు. ప్రజల్లో భయం.. బాధ్యతలను పెంచటానికి అతను చేసే ప్రయత్నాలు కూడా తమాషాగా ఉంటాయి.

ఫైనలు ఎక్కువేస్తే ట్రాఫిక్‌ వయిలేషన్సు తగ్గిపోతాయని.. ఇంగ్లీషును తప్పనిసరి చేస్తే పాఠశాలలు బాగుపడిపోతాయని.. ఆసుపత్రి ఉన్నచోట డాక్టర్లు నివాసముంటే అందరికీ ఆరోగ్యసేవలు అందుతాయనే ప్రాథమిక ఆలోచనలతో ఉంటాడు. లోతుగా ఉన్న విషయాలను పట్టించుకోడు. అంతే కాకుండా ఇలాంటి సమస్యలకు కారణమైన విషయాలపై దృష్టి పెట్టినట్లు కూడా కనబడదు.

ఇక సమాజాన్ని దోచుకొనే విలన్స లన్సుకు బుద్ధి చెప్పటానికి హీరో తన కండబలాన్నే నమ్ముకుంటాడు. అంతకన్నా అతనికి వేరే ఆయుధమేదీ ఉండదు. రాజకీయులందరూ ఒక కులమని.. అందరూ దొంగలని ప్రజల్లో ఉన్న భావనను క్యాష్‌ చేసుకోవటానికి హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు. తనపై కథనం రాసిన మీడియాను తిడతాడు. (అది కూడా లాజిక్‌ లేకుండా.. మీకు ఒక కూతురు ఉంటే ఇలాంటి కథనాలే రాస్తారా? అని..).

హఠాత్తుగా ఎక్సైట్‌ అవుతూ ఉంటాడు.. మధ్యమధ్యలో ఏడుస్తూ ఉంటాడు. ఇంత చెప్పుకున్నాం కాబట్టి కథలోకి కూడా వద్దాం. భరత అనే పిల్లాడు తన తల్లితండ్రుల నుంచి దూరంగా ఇంగ్లాండ్‌లో పెరిగి.. అక్కడే ఐదు డిగ్రీలు చదువుతాడు. వాళ్ల నాన్న చనిపోవటంతో అవిభాజ్య ఆంధ్రప్రదేశకు తిరిగివచ్చి ముఖ్యమంత్రి అయిపోతాడు. అతనికి వ్యవస్థల పట్ల కానీ.. అందరినీ కలుపుకొని పోవటం పట్ల కానీ అవగాహన, పరిణితి ఉన్నట్లు కనిపించవు.

వ్యవస్థలో ఉన్న లోపాలను తన హీరోయిజం ద్వారా (రౌడీలను చితక్కొటంలాంటి) చక్కదిద్దుతూ ఉంటాడు. ప్రతి సినిమాలో మాదిరిగానే ఇందులో స్నేహితుడిలా కనిపించే విలన్ (ప్రకాష్‌ రాజ్‌).. నేరుగా కనిపించే విలన్స్ (పోసానీ అండ్‌ కో).. అప్పుడప్పుడు పాటలు పాడటానికి ఒక హీరోయిన్.. ఇలా రకరకాల పాత్రలు ఉంటాయి. ఎంబీఏ దాకా చదువుకున్న హీరోయిన్ కు ఒక వ్యక్తిత్వం ఉన్నట్లు కనబడదు.

నాన్న వెళ్దామంటే వెళ్లిపోతుంది.. హీరో రమ్మంటే వచ్చేస్తుంది.. అప్పుడప్పుడు సీఎం సార్‌కు ఇబ్బంది కలిగిందని బాధపడుతుంది. పక్కనే ఉన్న ఛాంబర్‌లో ఉండటం తప్ప-ఆమె హీరోకు ఏ విధంగా ధైర్యాన్ని, సైర్థ్యాన్ని ఇచ్చిందో అర్థం కాదు. ఈ కోణం నుంచి చూస్తే చిన్నప్పుడు హీరోకు దొరకని తల్లి ప్రేమను ఆమె ఎలా తీరుస్తుందో అర్థం కాదు.

ఇక కథ విషయానికి వస్తే-మహేష్‌ ఇమేజ్‌ చుట్టూ అల్లిన కథలా అనిపిస్తుంది. ఒకే ఒక్కడు, లీడర్‌.. రాజనీతి(హిందీ) ఇలా రకరకాల స్ఫూర్తితో ఈ సినిమాను తీసినట్లు అర్థమవుతుంది. ఒక డైరక్టర్‌ స్క్రిప్ట్‌వర్క్‌ చేసేటప్పుడు హీరో ఇమేజ్‌.. అతని మేనరిజంలు పదే పదే అడ్డువస్తే ఎలాంటి కథ తయారవుతుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

ప్రతి ఫ్రేమ్‌లోను హీరో కనబడాలి.. పంచ్ డైలాగ్‌లన్నీ అతనికే ఉండాలి.. హీరో సర్వగుణాభిరాముడై ఉండాలనేది ఒకప్పటి సినిమాల ఫార్ములా. ఆ రోజులు పోయాయనే విషయాన్ని గమనించకుండా.. హీరో ఇమేజ్‌ మీద సర్ఫ్‌ చేద్దామనుకుంటే ఇలాంటి సగం ఉడికిన కథలే వస్తాయి. దీనికి పూర్తి బాధ్యత డైరక్టర్‌ కొరటాల శివదే! (బహుశా ఆయనకు వేరే ఇబ్బందులు ఉండి ఉంటాయి).

ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మహేష్‌ నటన గురించి. ఈసినిమాలో అతను చూడటానికి అందంగానే కనబడతాడు. కానీ డబుల్‌ చినను దాచే ప్రయత్నాలు జరిగాయని తెలిసిపోతూనే ఉంది. అక్కడక్కడ హీరో కృష్ణ పోలికలు(60లు దాటిన తర్వాత) కనిపిస్తాయి. ముఖ్యంగా మీసాలు పెట్టుకున్నప్పుడు అలా అనిపిస్తాడు.  బ్రహోత్సవం, స్పైడర్‌ ప్లాప్‌ల తర్వాత ఏదో కొత్తగా చేయాలనే మహేష్‌ ఈసినిమాను ఎంచుకొని ఉంటాడు. దీనిలో అన్నిరకాల ఎమోన్సును అతను బానే పలికించాడు.

కానీ కొన్నిసార్లు అతి నవ్వులు.. తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. మొత్తం సినిమాలో మనం చెప్పుకోవాల్సింది ప్రకాష్‌ రాజ్‌ నటన. ఒక సంక్లిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అతని నటన సినిమాకు ఒక ఎసెట్‌. అతను లేకపోతే సినిమా ఎలా ఉండేదనేది కూడా ఒక ప్రశ్నే! కెమెరా వర్క్‌, మ్యూజిక్‌, పాటలు అన్నీ మంచి స్థాయిలోనే ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి పదప్రయోగాలు అక్కడక్కడ చమక్కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఖాళీగా ఉండి సరదాగా సినిమాకు వెళ్దామనుకుంటే చూడాల్సిన సినిమా ఇది.

- భావన 
-(fbackfm@gmail.com)