చిత్రం: చంద్రముఖి-2
రేటింగ్: 1.5/5
తారాగణం: రాఘవ లారెన్స్, కంగన రనౌత్, రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, మహిమ నంబియార్, రావు రమేష్ తదితరులు
సంగీతం: కీరవాణి
కెమెరా: రాజశేఖర్
ఎడిటింగ్: ఆంటోనీ
నిర్మాత: సుభాస్కరన్
రచన-దర్శకత్వం: పి. వాసు
విడుదల: సెప్టెంబర్ 28, 2023
రజనికాంత్, జ్యోతిక జంటగా 2005లో వచ్చిన “చంద్రముఖి” ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. మణిచిత్రతళు పేరుతో 1993లో మలయాళంలోనూ, ఆప్తమిత్ర గా కన్నడలో 2004లోను వచ్చి హిట్టైనా రజనికాంత్ ప్రెజెన్స్ వల్ల తమిళంలో అది బ్లాక్ బస్టర్ అయ్యింది. దానినే తెలుగులో కూడా మనవాళ్లు డబ్బింగ్ రూపంలో హిట్ చేసారు.
తరవాత 2010లో “నాగవల్లి” పేరుతో చంద్రముఖి ఛాయలున్న సినిమా వెంకటేష్ తో అదే పి వాసు దర్శకత్వంలో వచ్చినా అది అంతగా నిలబడలేదు.
మళ్లీ ఇన్నాళ్లకి చంద్రముఖి-2 పేరుతో మన ముందుకొచ్చింది ఈ హారర్ ఫ్రాంచైజ్. ఎలా ఉందొ చూద్దాం.
కథలోకి వెళితే చంద్రముఖి ప్యాలెస్ కి ఒక కుటుంబం (రాధిక అండ్ కో) వస్తుంది. ఆ ఊరి దగ్గరలో వాళ్ల కులదేవత గుడిలో దీపం పెట్టి పూజచేస్తే ఆ కుటుంబానికి పట్టిన దోషాలు, కష్టాలు తొలగుతాయని ఒక గురువు చెప్తే వస్తారక్కడికి. కానీ అదే భవంతిలో దక్షిణం వైపు వాటాలో ఉన్న చంద్రముఖి ఆత్మ (కంగన) దివ్య (లక్ష్మీ మీనన్) ని ఆవహిస్తుంది. 200 ఏళ్ల క్రితం నాటి వేటయ్య రూపంలో ఉండే మదన్ (లారెన్స్) ని చంపడం చంద్రముఖి సంకల్పం. ఎవరీ వేటయ్య? ఏమా కథ? చివరికి ఏమౌతుంది?
ఈ కథ దాదాపు చంద్రముఖి-1 లాంటిదే. ఎక్కడా కొత్త ట్విస్టులేవీ లేవు. అయితే అక్కడ రజనికాంత్ ని చూసి ఇక్కడ ఆ స్థానంలో లారెన్స్ ని చూస్తుంటే గ్రాఫ్ డౌనైపోయింది. పోనీ తన పర్ఫార్మెన్స్ తో ఏమన్నా ఆకట్టుకున్నాడా అంటే అత్యంత పేలవంగా నటించాడు.
వడివేలుకి లారెన్స్ కి మధ్యన కామెడీ అయితే కితకితలు పెట్టుకున్నా నవ్వు రాదు. అప్పట్లో రజనికాంత్ చేసిన పాత్రలో తానున్నానని ఆ కన్షియస్నెస్ తో తన ఒరిజినాలిటీని పక్కన పెట్టి స్టారులా ఫీలౌతూ చేసినట్టుంది లారెన్స్. పైగా అతని పక్కన జాతీయ సుప్రసిద్ధ నటి కంగన రనౌత్.
ఫ్లాష్ బ్యాక్ లో కంగన పక్కన మరొక నటుడు కూడా ఉంటాడు. అతను శత్రు. ఇతనికి టేలెంటున్నా కంగన రనౌత్ పక్కన కేస్టింగులో తేలిపోయాడు.
మొత్తంగా చూస్తే కంగనా రనౌత్ తప్ప స్టార్డం ఉన్న నటులెవరూ లేరు. కమెర్షియల్ యాస్పెక్ట్ లో అదొక మైనస్ అనుకుంటే..కంటెంట్ పరంగా కూడా చాలా ఇబ్బందులున్నాయి. ఫ్రిజ్జులోంచి తీసిన పాత వంటకాన్నే వేడి చేసి వడ్డించినట్టు 2005నాటి చంద్రముఖికే కాస్త నటీనటవర్గాన్ని మార్చి మన ముందు పారేసారు.
టెక్నికల్ గా కూడా ఈ సినిమా ఔట్ డేటెడ్ గానే ఉంది. కీరవాణి సంగీతం పాత చంద్రముఖిలో విద్యాసాగర్ అందించిన సంగీతానికి ఏ మాత్రం సరితూగలేదు. పాటలు ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం మామూలే.
ఇంతా చేసి కంగనా రనౌత్ కూడా అద్భుతంగా నటించింది ఏమీ లేదిందులో. అయినా ఈ సౌత్ ఇండియన్ యాంబియెన్స్ కి, నటీనటుల సరసన నిలబడడానికి ఆమె చాలా ఆడ్ గా కనిపించింది.
లక్ష్మీ మీనన్ ఈ పాత్రకి రాంగ్ చాయిస్. మహిమా నంబియార్ చూడడానికి బాగుంది. రాధికా శరత్ కుమార్ అర్ధరాత్రి కూడా ఒంటినిండా నగలు పెట్టుకుని టీవీ సీరియల్ లేడీని తలపించింది.
ఈ సినిమాకి పెద్ద మైనస్ పాత చంద్రముఖి ఛాయలు లేకుండా కొత్త కథ రాసుకోలేకపోవడం. పైగా అక్కడ రజనికాంత్ ని పెట్టి ఇక్కడ లారెన్స్ ని పెట్టడం.
జ్యోతిక టైపులో కళ్లతో అభినయం చేసే టెలెంట్ లేని కంగన రనౌత్ ని తెచ్చి ఆమెనే కాకుండా ప్రేక్షకులని కూడా కష్టపెట్టడం..!
ఇదంతా ఒకెత్తైతే సినిమా మొత్తంలో ఎక్కడా కూడా భయం గొలిపే ఎలిమెంట్స్ లేకపోవడం.
ఇన్ని మైనస్సుల వల్ల ఈ చంద్రముఖి-2 ఆశించిన విధంగా ఎంగేజ్ చేయలేకపోయింది.
బాటం లైన్: భయపెట్టని హారర్