మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి కేసులో జైలు పాలు కాగా, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ వీధులపాలైంది. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్షలు, ఆ పార్టీలోని విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయి. ప్రొద్దుటూరు టీడీపీ నేతలు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా …ముగ్గురు నేతలు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు.
బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జమ్మలమడుగు రోడ్డులోని తన కార్యాలయం వద్ద, అలాగే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శివాలయం సెంటర్‌లో, మరో నాయకుడు సీఎం సురేష్‌నాయుడు పాత బస్టాండ్ సమీపంలోని తన అన్నా క్యాంటీన్ వద్ద నిరసన దీక్షా శిబిరాలను నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మాత్రం సీఎం సురేష్‌నాయుడి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.
ప్రొద్దుటూరు టికెట్ ప్రవీణ్‌కే అని పాదయాత్రలో భాగంగా లోకేశ్ పరోక్ష సంకేతాలు ఇచ్చి వెళ్లారు. కానీ ప్రవీణ్‌కు టికెట్ ఇస్తే ఇతర టీడీపీ నేతలెవరూ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఉక్కు ప్రవీణ్ పెద్దాచిన్నా అనే గౌరవం లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వరదరాజులరెడ్డి, సీఎం సురేష్, మల్లెల లింగారెడ్డి మండిపడుతున్నారు. బాబు త్వరగా విడుదల కావాలంటూ ఇటీవల ప్రొద్దుటూరు నుంచి తిరుమల వరకూ ప్రవీణ్ చేపట్టిన పాదయాత్రకు ఈ ముగ్గురు నేతలు మద్దతు పలకలేదు.
ప్రొద్దుటూరు టీడీపీలో మనస్పర్థలను పోగొట్టే పరిస్థితి కనిపించడం లేదు. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా అక్కడ వ్యవహారం సాగుతోంది. టీడీపీలో ఆధిపత్యం కోసం సొంత పార్టీ నాయకుల్లో తీవ్రమైన పోరు సాగుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. తమకు టికెట్ దక్కకపోతే, సొంత పార్టీ నాయకుడిని ఓడించడానికి మిగిలిన నేతలు సిద్ధమవుతున్న పరిస్థితిని ప్రొద్దుటూరులో చూడొచ్చు. ఇదే వైసీపీకి కొండంత బలం.