చంద్రబాబు అరెస్ట్ హడావుడి దాదాపు చల్లారినట్లు కనిపిస్తోంది. వినాయకచవితి ఉత్సవాలు రావడం, నెలాఖరులో వరుస సెలవులు రావడం, లీగల్ బాటిల్ గట్టిగా జరుగుతుండడం, అయిదు వరకు చంద్రబాబు బయటకు రారని క్లారిటీ రావడం, అరెస్ట్ భయంతో లోకేష్ ఢిల్లీకి పరిమితం కావడం, అదే భయంతో చోటా.. బడా నాయకులు అంతా ప్రకటనలకు, సమావేశాలకు మాత్రమే పరిమితం కావడంతో నిరసన అన్నది కాస్త మాయమైనట్లే కనిపిస్తోంది.
నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే జరిగిన బంద్ తోనే పరిస్థితి అర్ధం అయిపోయింది. అధికారం అనుభవించి, కడుపు నిండిన నాయకులు పెద్దగా ఆసక్తిగా లేరని, మళ్లీ అధికారం అదింతే తప్ప ముందు వరుసలోకి రారని, అలా వస్తే తప్ప శ్రేణులు కదలవు అని. కానీ నిరసనను బతికించడానికి, సింపతీని పెంచడానికి, బాబును మచ్చలేని నాయకుడిగా చరిత్రలో నిలబెట్టడానికి, ఏదో విధంగా లేని హడావుడిని మీడియా భూతద్దంలో చూపించాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు అది కూడా చల్లారి పోయింది. ఏమీ లేకుండా కోర్టులు మాత్రం అంత పట్టుదలగా ఎందుకు వుంటారు అన్న అనుమానం జనంలోకి వెళ్లింది. పైగా నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వానికి కోర్టు మొట్టి కాయలు అనే హెడ్డింగ్ చూసి, చూసి జనాలకు అర్థం అయింది. అందువల్ల అవే కోర్టుల్లో ఇప్పుడు బాబుకు వ్యతిరేకంగా వస్తుంటే, రెండింటినీ ఒకే విధంగా చూస్తున్నారు తప్ప వేరు వేరుగా కాదు.
ఇక ఇప్పుడు మిగిలింది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. కేవలం బాబుగారికి బెయిల్ రావాలి. అప్పుడు ఆయన జనాల్లోకి వెళ్లాలి. అప్పుడు అరెస్ట్ అయినా లోకేష్ కు తండ్రి అండ వుంటుంది. అందువల్ల పెదబాబు.. చినబాబు ఇద్దరికీ ఒకటే మిగిలిన దారి. కోర్టుల ద్వారా ఉపశమనం కలగాల్సిందే.